చలపతి, యాంకర్ రవిలపై కేసు నమోదు
హైదరాబాద్: మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యానించిన ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు, యాంకర్ రవిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలపై తీవ్ర అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించిన నటుడు చలపతిరావు, ఆయన వ్యాఖ్యలను బలపరుస్తూ హేళన చేసిన టెలివిజన్ ప్రముఖ యాంకర్ రవిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సరూర్ నగర్ పోలీసులు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌లో ముందు వరుసలో కూర్చున్న చలపతినుద్దేశించి 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతి ఇచ్చిన సమాధానంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయిన విషయం తెలిసిందే. ఈ సీనియర్ నటుడి వల్గర్ కామెంట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.