
సాక్షి, తమిళ సినిమా: నటుడు శింబు అంటే సంచలనానికి మారుపేరు. ఆ మధ్య నయనతార, హన్సికతో ప్రేమాయణంతో వార్తల్లోకెక్కారు. ఆ తరువాత బీప్ సాంగ్ అంటూ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర నిర్మాత నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. శింబు న టించిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందడంతో నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిందని.. అందుకు శింబు కారణం అని పేర్కొన్నారు. ఏమైనా నేను చూసుకుంటాను, నాది బాధ్యత అని శింబు మాట ఇచ్చి మోసం చేశారని నిర్మాతల మండలిలో ఆయన ఫిర్యాదు చేశారు. శింబు సరిగా షూటింగ్‌కు రాలేదని, కథను కూడా మార్చేశారని ఆరోపణలు గుప్పించారు.
బదులివ్వాల్సిన అవసరం లేదు
నిర్మాత ఆరోపణలకు స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తాను ఏమీ స్పందించాల్సిన అవసరం లేదని శింబు తెలిపాడు. తనకు నిర్మాత రూ.3.5 కోట్లు పారితోషికం ఇవ్వాలని, ముందు ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై రెడ్ కార్డ్ వేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని శింబు అన్నారు. ఇలా ఉండగా శింబుపై రెడ్‌కార్డ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో మణిరత్నం చిత్రం నుంచి ఆయన్ని తొలగించి మరో నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.