మల్లయోధుడిగా...
ఒకపక్కన ‘పీకే’ చిత్రం రికార్డులను తిరగరాస్తుంటే, హిందీ చిత్ర సీమలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఆమిర్‌ఖాన్ నటించే తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్నదే ఆ చర్చ. ప్రస్తుతం వినవస్తున్న వార్తలు గనక నిజమైతే, ఆమిర్ తన తదుపరి చిత్రంలో మల్లయోధుడిగా కనిపించనున్నారు. నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘డంగల్’ చిత్రంలో నిజజీవితంలో ప్రసిద్ధ మల్లయోధుడైన మహావీర్ ఫోగత్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ భారతీయ మహిళా మల్లయోధులైన గీతా, బబితా కుమారి ఫోగత్‌ల తండ్రి మహావీర్.
కుమార్తెలిద్దరినీ మల్లయుద్ధంలో ప్రోత్సహించిన ఆ తండ్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందట! ఈ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ ఇప్పటికే ప్రతి రోజూ రెండేసి గంటల వంతున వ్యాయామం చేస్తున్నారట. వెండితెరపై అసలు సిసలు మల్లయోధుడి లాగా కనిపించడం కోసం ప్రత్యేకించి హాలీవుడ్ నుంచి ఒక ఫిట్‌నెస్ నిపుణుణ్ణి కూడా రప్పించారట.
గతంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన ‘చక్ దే ఇండియా’, ‘మేరీ కోమ్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, ఏ పాత్ర పోషించినా దానికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసేందుకు ప్రయత్నించే ఆమిర్ ఈసారి తెరపై మల్లయోధుడిగా కూడా అదే స్థాయి అంకితభావం చూపడం ఖాయమేననిపిస్తోంది.