
'ఆ సినిమా చూడాలనుకుంటున్నా'
రణవీర్ కపూర్ హీరోగా నటించిన 'బాంబే వెల్వెట్' సినిమాను చూడాలనుకుంటున్నట్టు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు.
ముంబై: రణవీర్ కపూర్ హీరోగా నటించిన 'బాంబే వెల్వెట్' సినిమాను చూడాలనుకుంటున్నట్టు విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఈనెల 15న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చరిత్రకారుడు జ్ఞాన్ ప్రకాశ్ రాసిన 'ముంబై ఫ్యాబ్లెస్' పుస్తకం ఆధారంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను తెరకెక్కించారు.
సోషల్ మీడియాలో 'బాంబే వెల్వెట్'ను వెక్కిరిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారని, తానింకా సినిమా చూడలేదని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూశానని, యూనిట్ బాగా కష్టపడినట్టు తెలుస్తోందన్నారు. ఈ సినిమా బాలేదనడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇప్పటికీ ఈ సినిమా చూడాలనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
'బాంబే వెల్వెట్' కోసం ముందుగా ఆమిర్ ఖాన్ ను అనురాగ్ కశ్యప్ సంప్రదించాడు. ఏడాది వేచి చూసిన తర్వాత రణబీర్ కపూర్ తో తీశాడు. పీకూ, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలు కూడా చూడాలనుకుంటున్నానని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు.