ఆమిర్ ఖాన్ ఓ సూపర్‌స్టార్. అందులో నో సీక్రెట్స్! ఆమిర్ నటించిన ఏ చిత్రమైనా సూపర్‌హిట్టే. అందులో నో డౌట్స్. కానీ, ఆయన్ను మించిన ఓ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఉన్నారని ఆమిర్ చెబుతున్నారు. ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమిర్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు....
► ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు!
నిజమే. ‘మంచి కథ దొరికితే’ అని కూడా చెప్పాను కదా! తెలుగులో నటించడానికి నాకు ఎలాంటి సమస్యా లేదు. తెలుగు దర్శకులతో నా కోసం మంచి కథలు, క్యారెక్టర్లు రాయమని చెప్పండి. ఐ యామ్ రెడీ!
► ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలోనూ (డబ్బింగ్) మంచి హిట్టవుతున్నాయి. వాటిని మీరు చూస్తారా?
టైమ్ దొరికినప్పుడు చూస్తుంటా! ‘బాహుబలి’ చూశా. ప్రభాస్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ యాక్టర్. అద్భుతంగా చేశాడు. తెలుగులో మంచి మంచి నటులు, దర్శకులు ఉన్నారు. మంచి సిన్మాలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ హిందీలో ‘దంగల్’ కంటే ఎక్కువ వసూలు చేసింది. కానీ, నేనింకా ఆ సినిమా చూడలేదు.
► అవునా!? పోనీ, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకున్నారా?
తెలియదు. పొరపాటున కూడా ఆ సీక్రెట్ చెప్పవద్దు. నేనే తెలుసుకుంటా. త్వరలో ‘బాహుబలి–2’ చూస్తా.
► ఓకే! మీరేంటి? చెవులకు పోగులు, ముక్కుపుడక... ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సర్‌ప్రైజ్ లుక్‌లో కనిపిస్తారా?
లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం! ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సంగీత దర్శకుడు శక్తి కుమార్‌గా కనిపిస్తా. మంచి ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. సింగర్ కావాలనే ఓ 14 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేది చిత్రకథ.
► ఈ సినిమాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరు?
చాలామంది ఉన్నారు. సింగర్ కావాలనే అమ్మాయిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్, ఆమె తల్లిగా మెహర్ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరి కథే ఈ సినిమా. నేను స్టార్స్‌తోనే సినిమాలు చేయాలనుకోను. కథకు ఎవరు సూటైతే వాళ్లతో చేయాలనుకుంటా. ‘దంగల్’లో నలుగురు కొత్తమ్మాయిలు ఎంత బాగా చేశారో చూశారు కదా! కొత్త టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ నాకు వస్తుండడం హ్యాపీగా ఉంది. ఈ సిన్మాతో దర్శకుడు అద్వైత్ చందన్, కొత్త సింగర్స్, పలువురు టెక్నిషియన్స్‌ని పరిచయం చేస్తున్నా.
► 2 వేల కోట్లు కలెక్ట్ చేసిన ‘దంగల్’ తర్వాత మీరు నటించిన చిత్రమిది. ప్రేక్షకుల్లో బోల్డన్ని అంచనాలు ఉన్నాయి. మీరేమో ఓ చిన్న సినిమా చేశారేంటి?
ఇండియాలోనే కాదు... చైనా, హాంకాంగ్‌లతో పాటు పలు దేశాల్లో ‘దంగల్’ సూపర్‌హిట్. ఆ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. ‘దంగల్’ నచ్చినోళ్లకు కచ్చితంగా ఈ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా నచ్చుతుంది. ఇందులోనూ మనసుల్ని కదిలించే కథ, కథనాలు ఉన్నాయి. సమాజంలో కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం.
► ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ట్రైలర్‌లో ‘అవార్డులు తీసుకుని తీసుకుని విసుగొచ్చింది’ అనే డైలాగ్ చెప్పారు. మీరు అవార్డు వేడుకలకు అటెండ్ అవ్వరు కదా?
అందుకే దర్శకుడు కథ చెప్పగానే.. ‘శక్తి కుమార్ పాత్రలో నాకు నేను కనిపించడం లేదు’ అన్నాను. అద్వైత్ మాత్రం నేనే నటిస్తే బాగుంటుందన్నాడు. ‘ఓ పని చేద్దాం. నేను ఆడిషన్ ఇస్తా. బాగుంటే చేద్దాం’ అన్నాను. చివరికి, నన్నే సెలక్ట్ చేశాడు.
► అవార్డుల గురించి వచ్చింది కాబట్టి... ఆస్కార్స్ వచ్చే ప్రతిసారి మన దర్శకులెవరికీ ఆ అవార్డు అందుకునే అర్హత లేదా? అనే ప్రస్తావన వస్తుంది. మీ దృష్టిలో ఆస్కార్స్ సాధించగల దర్శకుడు ఎవరు?
ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులు మన దగ్గరున్నారు. వెరీ టాలెంటెడ్. మంచి సినిమాలు తీస్తున్నారు. ఇండియాతో పాటు చైనా, హాంకాంగ్‌లలో భారీ హిటై్టన ‘దంగల్’ను తీసింది మన నితీశ్ తివారీనే కదా! వరల్డ్ క్లాస్ సినిమాలు మనమూ తీస్తున్నాం. సో, ఎవరో (అమెరికన్స్) ఇచ్చే అవార్డు కన్నా... ప్రేక్షకులు ఇచ్చే ప్రశంసలు, ఆదరణే ముఖ్యమని భావిస్తా.
► మీరు రొమాంటిక్ సిన్మా చేసి చాలా రోజులైంది. ఏ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలనుంది?
ఓ అమ్మాయితో రొమాన్స్ చేయాలనుంది. తను మంచి యాక్టర్. అందంగానూ ఉంటుంది. కానీ, నాతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తన పేరు కిరణ్‌రావ్ (ఆమిర్ భార్య) అని నవ్వేశారు.
Comments
Please login to add a commentAdd a comment