ABCD Telugu Movie Review | ‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ | ABCD Review, in Telugu | Allu Sirish - Sakshi
Sakshi News home page

‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ

Published Fri, May 17 2019 12:22 PM | Last Updated on Fri, May 17 2019 1:15 PM

ABCD Telugu Movie Review - Sakshi

టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్‌ బార్న్‌ కన్‌ప్యూజ్డ్‌ దేశీ)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : అల్లు శిరీష్‌, రుక్సర్‌ ధిల్లాన్‌, భరత్‌, రాజా, నాగబాబు
సంగీతం : జుడా సాండీ
దర్శకత్వం : సంజీవ్‌ రెడ్డి
నిర్మాత : మథురా శ్రీధర్‌, యష్‌ రంగినేని

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్‌ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్‌ హిట్‌ సాధించాడా..?

కథ‌ :
అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. న్యూయార్క్‌లో సెటిల్‌ అయిన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి సరదాగా లైఫ్‌ గడిపేస్తుంటాడు.  నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్‌.. వెకేషన్‌ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు.

అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్‌ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
అల్లు శిరీష్‌ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్‌ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్‌ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్‌ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్‌ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్‌, శుభలేక సుధాకర్‌, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్‌ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్‌ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్‌ అయ్యింది.

జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్‌లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్‌ఫుల్‌గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్‌ రామ్. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కథ
కొన్ని కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
కామెడీ పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటం
బలమైన సన్నివేశాలు లేకపోవటం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement