
ఆటుపోట్ల సినీ ప్రయాణం
మహిళలు మెచ్చిన అలనాటి కథానాయకుడు ... ఆరడుగుల ఎత్తు, అందమైన ముఖవర్ఛస్సు.. గంభీరమైన గొంతు.. ఒక నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న అరుదైన నటుడు రంగనాథ్. ఒకప్పుడు స్టార్ ఇమేజ్కు చేరువైన హీరో అయినా అదే సమయంలో విలన్గాను నటించారు. తరువాత వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ప్రస్తుతం అడపదడపా మాత్రమే సినిమాలు, సీరియల్స్ చేస్తున్న ఈ అలనాటి మేటినటుడి ఆకస్మిక మరణం తెలుగు తెరకు తీరని లోటు.
సీనియర్ నటులు రంగనాథ్ 1949 జూలైలో మద్రాసులో జన్మించారు. కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్న వారు కాకపోవటంతో రంగనాధ్ బాల్యం అంతా సాదాసీదాగానే గడిచింది. అయితే బాల్యంలో తాతగారి ఇంట్లో పెరగటం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారింట్లో అందరూ గాయకులు కావటంతో రంగనాథ్ కూడా ఏదో ఒక కళ రంగంలో ప్రవేశించాలనుకున్నారు. అదే బాటలో చిన్నతనంలోనే నాటకాల వైపు ఆకర్షితులయ్యారు. అలా మొదలైన ఆయన ప్రయాణం వెండితెర వరకు సాగింది. రంగనాధ్ కోరికకు తల్లి ప్రొత్సాహం తోడవటంతో నటుడు కావాలన్న ఆయన కోరిక మరింత బలపడింది.
అయితే అదే సమయంలో కుటుంబ బాధ్యతులు మీద పడటంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బిఎ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే వెంటనే వివాహం. తరువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్నా నటుడవ్వాలన్న కోరిక మాత్రం చచ్చిపోలేదు. తను నాటకాలు వేసే నాటకరంగం వారి ద్వారా 1969లో చిన్న అవకాశం వచ్చింది. అయితే పాత్రకు గుర్తింపు రాలేదు. అదే సమయంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి. దీంతో బాపుగారి సలహాతో చందన సినిమాకే అంగీకరించారు. అలా వెండితెర మీద హీరోగా రంగం ప్రవేశం చేశారు రంగనాధ్. పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు.
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటం ఆయనను మహిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పులు కారణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వచ్చాయి. దీంతో మరో మార్గం లేక విలన్గా మారారు. 'గువ్వల జంట' సినిమాతో తొలి సారిగా ప్రతినాయక పాత్రలో అలరించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాధ్. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్ తో పాటు, రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్ లోనూ కీలక పాత్రలో నటించారు.
అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవటంతో తరువాత దర్శకత్వనికి దూరమయ్యారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సినీరంగంతో అనుబందాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించటం తెలుగు సినీ కళామతల్లికి తీరనిలోటు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరించిన రంగనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.