![Actor Satyajeet Dubey In Isolation After His Mother Tested Covid 19 Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/18/satyajeet-dubey1.gif.webp?itok=0Siw4F0e)
తల్లితో నటుడు సత్యజిత్ దూబే
ముంబై: తన తల్లి ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిందని బాలీవుడ్ నటుడు, ‘ప్రస్థానం’ ఫేం సత్యజిత్ దూబే వెల్లడించాడు. ప్రస్తుతం ఆమె నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘తీవ్రమైన తలనొప్పి, జ్వరం అమ్మను వేధించాయి. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తనను ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. తను మహమ్మారితో ధైర్యంగా పోరాడి తిరిగి వస్తుంది. అయితే ప్రస్తుతానికి నాలో, నా సోదరిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనపడటం లేదు. అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. రోజూ అమ్మతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాం. డాక్టర్లు, నర్సులు తనను చాలా బాగా చూసుకుంటున్నారు. (సహాయం కోసం వేలం.. )
ఈ విపత్కర సమయంలో మాకు అండగా నిలిచిన ఇరుగుపొరుగు, స్నేహితులు, కరోనా యోధులు, బీఎంసీ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకెంతో అవసరం’’అని సత్యజిత్ పేర్కొన్నాడు. మహమ్మారి ఇలా అన్ని వర్గాలను ఒక్కటి చేస్తుందని, ఒకరి బాధను మరొకరు పంచుకునేలా చేస్తుందని తానెన్నడూ ఊహించలేదని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక తన తల్లి నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినపుడు మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు వంటి నిబంధనలు పాటించిందని.. అయినప్పటికీ తనకు వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా ఆల్వేస్ కభీ కభీ సినిమాతో బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చిన సత్యజిత్... బాంకే కీ క్రేజీ బరాత్, కెర్రీ ఆన్ కటాన్, లవ్ ఆన్ ది రాక్స్- టేబుల్ ఫర్ టూ తదితర చిత్రాల్లో నటించాడు. చివరగా ‘ప్రస్థానం’ సినిమాలో సంజయ్ దత్, మనీషా కొయిరాలా, అలీ ఫజల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. (పంజాబీ నటుడి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment