సాక్షి, ముంబై : బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ మంచి పేరుంది. 1999లో అమీర్‌ఖాన్ సర్పరోష్ లో చిన్నపాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధిఖీ ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చాడన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. థియేటర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కున్నాడు.
తన ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా కీలకం అని ఆయన చాలాసార్లు చెప్పుకునేవారు. అందుకేనేమో బీబీసీ ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయక, ప్రభావశీలురైన మహిళల జాబితాలో మెహరున్నీసా సిద్ధిఖీకి చోటుదక్కింది. ‘ఓ మారుమూల పల్లెటూరిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ మహిళ కష్టాలను ధైర్యంగా ఎదుర్కుని నిలిచింది’ అంటూ తన తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను నవాజుద్దీన్ షేర్ చేశాడు.
బీబీసీ 2017కి గానూ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన జాబితాలో ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, సామాజిక వేత్త ఊర్వశి సాహ్ని, మహిళా ఉద్యమ కార్యకర్త నిత్యా తుమ్మలచెట్టికి చోటు దక్కింది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వీళ్లు సాధించిన విజయాల గురించి చర్చించనున్నారు.