
చెన్నై : అంజలి కోలీవుడ్, టాలీవుడ్‌లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీని తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అంజలి తొలి చిత్రం కట్రదు తమిళ్ తోనే తన ముద్రను బలంగా వేసుకుంది. ఆ తరువాత తన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అంగాడి లెరు అనే చెప్పాలి. అంజలి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. తాజాగా అంజలి నటించిన తమిళ చిత్రం బెలూన్ ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది.
నటుడు జై కథానాయకుడిగా నటించిన ఇందులో నటి జననీఅయ్యర్ మరో నాయకిగా నటించారు. నవ దర్శకుడు శినిష్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్రం యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా చిత్ర కథానాయకి విలేకులతో ముచ్చటించారు. ఆ వివరాలు చూద్దాం.
ప్ర: బెలూన్ చిత్రం గురించి?
జ: ఇది డిఫరెంట్ జానర్‌లో రూపొందిన హర్రర్‌తో కూడిన ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలు చాలా ఉంటాయి. నేను సుమారు ఐదేళ్ల తరువాత నటుడు జై తో కలిసి నటించిన చిత్రం ఇది.
ప్ర: మీ పాత్ర గురించి?
జ: ఇంతకు ముందు నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాల్లో పాత్రలకు పూర్తి భిన్నంగా బెలూన్ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. ఆ చిత్రం తెలుగులోనూ ఇదే పేరుతో అనువాదమై విడుదల కానుంది.
ప్ర: ఎలాంటి కథా పాత్రలు పోషించాలనుకుంటున్నారు?
జ: ఎలాంటి పాత్రలైనా చేయడానికి రెడీ .అయితే అవి కొత్తదనంతో కూడుకున్నవై ఉండాలని ఆశిస్తున్నారు.
ప్ర: తెలుగులో గ్లామరస్ పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఆ తరహా పాత్రల్లో కనిపించడం లేదే?
జ: నాకిక్కడ గ్లామర్‌తో కూడిన కథా చిత్రాల అవకాశాలు రావడం లేదు. అంతేగానీ గ్లామర్‌గా నటించనని నేను చెప్పడం లేదు. తెలుగులో మంచి వైవిధ్య కథా చిత్రాలు వస్తున్నా, అక్కడ కలర్‌ఫుల్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతాయి.
ప్ర: మీరు బాగా నటించాననుకున్న చిత్రాలు.
జ: అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాలు నా నటనకు అద్దం పడితే, కట్రదు తమిళ్ నా కెరీర్‌లో స్పెషల్ చిత్రంగా నిలిచిపోతుంది.
ప్ర: ఈ ఏడాది ఎలా గడిచింది? 2018లో సినీ జీవితం ఎలా సాగనుంది?
జ: ఈ ఏడాది నటిగా మంచి చిత్రాలే చేశాను. అయితే 2018లో ఇంకా బాగుంటుంది. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలతో బిజీగా ఉండబోతున్నాను.
ప్ర: నటుడు జై తో కలిపి మీపై వస్తున్న వదంతుల గురించి?
జ: అవన్నీ వదంతులే. జై నాకున్న మంచి స్నేహితుల్లో ఒక్కరు అంతే. అంత కంటే మా మధ్య ఏమీ లేదు.
ప్ర: పెళ్లెప్పుడు చేసుకుంటారు? మనసులో ఎవరైనా ఉన్నారా?
జ: నిజం చెప్పాలంటే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. మరి కొన్నేళ్ల వరకూ పెళ్లి చేసుకోను. అదే విధంగా నా మనసుల్లో ఇప్పటికీ ఎవరూ లేరు. ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాను.
ప్ర: కాబోయే భర్త సినిమాకు చెందిన వాడై ఉంటారా?
జ: ఆ విషయం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ ముందుగా మీకే చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment