సాక్షి, తిరువనంతపురం : నెయ్యట్టిన్కర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి. రాత్రి పూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్. అక్కడ ఒక మధ్య వయస్కురాలైన ఓ మహిళ దోశెలు వేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమెను చూసి షాక్ తిన్నాడు. ఆమెతో కాసేపు మాట్లాడి.. అదంతా వీడియో తీసి తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతే అదిప్పుడు అక్కడ పెద్ద న్యూస్‌గా మారింది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు మాలీవుడ్ సీరియల్ కవితా లక్ష్మీ. ఏషియన్ నెట్ ఛానెల్‌లో ప్రసారం అయ్యే స్త్రీ ధనం సీరియల్‌తో ఆమె బాగా ఫేమస్. ఏదో సీరియలో లేక రియాల్టీ షోలో భాగంగా ఆమె ఇలా చేసిందనుకుంటే పొరపాటే. జీవితంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటున్న ఆమె పగటి పూట నటిస్తూ.. రాత్రిపూట ఇలా హోటల్ నిర్వాహణతో కుటుంబాన్ని వెలదీస్తోందంట. ఈ విషయాలను ఆమె స్వయంగా మనోరమ పత్రికకు వెల్లడించారు.
ఆరు నెలల క్రితం ఆమె తన కొడుకు ఆమె యూకేకు పంపించారు. అయితే ట్రావెల్ ఏజెన్సీ సంస్థ వారు దారుణంగా మోసం చేయటంతో ఇప్పుడు అతను అక్కడ కష్టాలు ఎదుర్కుంటున్నాడు. దీంతో ఆమె తెలిసినవారినల్లా సాయం కోసం చెయ్యి చాచింది. ప్రోడక్షన్ కంట్రోలర్ మనోజ్, నిర్మాత మనోజ్ పానికర్‌లు మాత్రమే కొంత సాయం చేయగా.. ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రాలేదంట. కష్టాలు పెరిగిపోతుండటంతో ఉన్న డబ్బుతో ఓ గ్రానైట్ షోరూమ్‌ను ఓపెన్ చేసి.. దాని ద్వారా లోన్ కోసం యత్నించారంట. కానీ, కుదరకపోవటంతో చివరకు దాన్ని మూసేశారంట.
ఇలా చివరకు ఏ దారి లేకపోవటంతో ఓ హోటల్‌లో కూడా పని చేసినట్లు ఆమె చెబుతున్నారు. ‘నేను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. నా కుమారుడికి ఇలా కష్టపడి నెలనెలా డబ్బులు పంపుతున్నా. ఇప్పుడు నా బాధల్లా కూతురి గురించే’ అని ఆమె చెబుతున్నారు. అన్నట్లు మళయాళ మెగాస్టార్ మమ్మూటీ రికమండేషన్‌తో ఈ మధ్యే ఆమెకు రెండు సీరియళ్లలో అవకాశాలు దక్కాయంట. అయినా హోటల్ నిర్వాహణ మాత్రం ఆపనని కవిత అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment