కేన్సర్ ఎవేర్నెస్ కలిగించాలి: హీరోయిన్
నటి గౌతమి ఇటీవల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుండడంతో పాటు, రాజకీయపరమైన అంశాలపైనా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రిని కూడా కలిశారు. కాగా బ్రెస్ట్ కేన్సర్ అవగాహన కార్యక్రమం, రక్తదాన కార్యక్రమాలు కరూర్‌లో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమి బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రసంగించారు.
అనంతరం గౌతమి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్‌పై నగర మహిళల్లో మంచి అవగాహన ఏర్పడుతున్నా, గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కలగాల్సి ఉందన్నారు. మహిళలు బ్రెస్ట్ కేన్సర్ గురించి ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, వైద్య పరికరాలను గ్రామాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం గురించి వివరించడానికే తాను ప్రధానమంత్రిని కలిశానని తెలిపారు.అదే సమయంలో తమిళ రైతు సమస్యలపై స్పందించిన గౌతమి, దేశానికి వెన్నుముక రైతేనన్నారు. అలాంటి రైతుల కోరికలను ఎవరైనా నెరవేర్చాల్సిందేనని పేర్కొన్నారు.