నటీమణులకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించడం అన్నది ఖచ్చితంగా వారి ప్రతిభకు నిదర్శనమే. అలాంటి అవార్డుకు అందుకున్న తరువాత అవకాశాలకు దూరమైన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఈమెలో అందంతో పాటు అభినయం మెండుగా ఉంది. కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సహజ నటి ప్రియమణి. అలాంటి నటిని తమిళ చిత్ర పరిశ్రమ పక్కన పెట్టడం బాధాకరం. అయితే తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయిందేమో గానీ ఆమె సినిమా మంత్రం వదలిపెట్టలేదు. మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూనే ఉన్న ప్రియమణితో చిట్ చాట్
తమిళ సినిమా పక్కకే రావడం లేదు ఎందుకు?
రానని నేనెప్పుడైనా ఎవరితోనైనా చెప్పానా? అవకాశాలు ఇస్తే వెంటనే వస్తాను. అవకాశాలు ఇవ్వండని అడగలేనుగా. ఈ విషయం దర్శక నిర్మాతలను ప్రశ్నించండి. వారేమి బదులిస్తారో చూద్దాం. ప్రస్తుతానికి ఒకరిద్దరు తమిళంలో అడగారు కానీ ఆ కథలు నచ్చలేదు. మంచి కథ, బలమైన పాత్ర ఉంటే మరుక్షణమే చెన్నైలో వాలిపోతా.
జాతీయ అవార్డు అందుకున్న తరువాత గ్లామర్ పాత్రలే చేస్తున్నారు కదా?
ఏ ప్రేక్షకుడు? ఎవరితో అలా అన్నారో చెప్పండి. ఇది చాలాకాలంగా నన్ను వెంటాడుతున్న ప్రశ్న. జాతీయ అవార్డు గెలుచుకుంటే ఆ తరువాత కాలమంతా ఆ తరహా పాత్రలనే పోషించాలా? లంగా ఓణీలే ధరించాలా? నా వయసు హీరోయిన్లందరూ రకరకాల డ్రస్సులు ధరించి నటిస్తుంటే నేను మాత్రం అలా నటించకూడదా?
లెస్బియన్స్‌కు మద్దతు పలికి వివాదం రేపారే?
ఇక్కడ ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. నేనొక మలయాళ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లెస్బియన్స్ ప్రస్తావన వచ్చింది. అది వారి వ్యక్తిగత విషయం మాత్రమే కానీ, అది తప్పా? ఒప్పా? అని నిర్ధారించడానికి మనమెవరం? అని చెప్పాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నేనా తరహా చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం చేశారు.
లెస్బియన్ల తరహా చిత్రంలో షబ్నా ఆజ్మీ‘ఫైర్’లో నటించారు కదా?
ఆమె బాలీవుడ్‌లో నటించారు. అక్కడ ఆ విషయాన్ని భూ తద్దంలో చూడరు. ఇక్కడ అలా నటిస్తే మీడియా ఏకిపారేస్తుంది. అదే విధంగా దక్షిణాది సినీ ప్రేక్షకులు అలాంటి చిత్రాలను స్వాగతించారు. ప్రేక్షకులు సచ్చని చిత్రాల్లో నేను నటించను.
బెంగళూరు భామలు రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు. మీకు ఆసక్తి ఉందా?
జ: రాజకీయాలు నాకు సెట్ కావు. అందుకు చాలా అనుభవం కావాలి. నాకంత అనుభవం, ప్రతిభ లేవు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను రాజకీయాల జోలికి పోను.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
కన్నడంలో దర్శన్ సరసన అమ్రిషా అనే చిత్రంలో నటిస్తున్నాను. విదేశాల నుంచి తిరిగొచ్చే ఎన్‌ఆర్‌ఐ యువతి పాత్ర. అదే విధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులోను నా పాత్ర వైవిధ్యభరితంగా ఉంటోంది.
ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారట...!
అట్టే చూస్తూ ఉంటే నా పెళ్లి ముహుర్తం కూడా నిర్ణయించేట్టున్నారు. నా పెళ్లికి ఇప్పుడు అవసరం ఏముంది? నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియచేస్తాను. అయినా నా పెళ్లి గురించి చింతించడానికి మా అమ్మ ఉంది. ఇతరులకెందుకు అంత బాధ.