మాలీవుడ్‌పై దృష్టి
ఒక భాషలో కాకపోతే ఇంకో భాషలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం హీరోల కంటే హీరోయిన్లకు అధికం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఒక భాషలో ఐరన్ లెగ్‌గా ముద్ర పడిన నటీమణులు ఇతర భాషల్లో లక్కీ నాయకిలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు నటి శ్రుతీహాసన్‌నే తీసుకుంటే తొలుత హిందీలో లక్ అనే చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యారు. అది ఆమెకి కిక్ ఇచ్చి ఉండవచ్చు గానీ లక్‌ను మాత్రం అందించలేదు. అదే విధంగా తెలుగులో నటించిన తొలి చిత్రం నిరాశనే మిగిల్చింది. ఇక తమిళంలో నటించిన 7 ఆమ్ అరివు ఆశించిన విజయాన్ని అందించలేదు.
ఇలా మూడు భాషల్లో ఆదిలో అపజయాలనే చవి చూసిన శ్రుతీహాసన్ ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. బాల నటిగా అంజలి చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న నటి షామిలి. అనేక చిత్రాలలో అబ్బురపరచే అభినయాన్ని ప్రదర్శించి, విజయాలతో పాటు ప్రశంసలు అందుకున్నారు ఈమె. కథానాయకిగా అలాంటి విజయం ఒక్కటి కూడా దరి చేరలేదు. షామిలీ నాయకిగా ఓయ్ అనే తెలుగు చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తరువాత మలయాళంలో వళ్లియం తెట్టి పెళ్లియం తెట్టి అనే చిత్రంలోనూ నటించారు. అదీ అంతగా విజయం సాధించలేదు. దీంతో నటనకు కొంత గ్యాప్ ఇచ్చి అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్యను అభ్యసించడానికి వెళ్లారు.
అనంతరం చెన్నైకి తిరిగొచ్చిన షామిలీ మళ్లీ నటనకు సిద్ధం అయ్యారు. రావడానికి చాలా అవకాశాలు వచ్చాయి. అందులో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే చివరి నిమిషంలో ఆ చిత్రం నుంచి వైదొలగారు. (కాదు తొలగించారన్న ప్రచారం కూడా జరిగింది) కాగా ప్రస్తుతం విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత త నకు మంచి అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉన్న షామిలీకి ప్రస్తుతం ఇక్కడ కొత్త అవకాశాలు లేవు. తాజాగా మాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. కొందరు దర్శకుల కథలు వింటున్నారనీ, త్వరలోనే అక్కడ రీఎంట్రీకి బాటలు పడే అవకాశం ఉందనీ కోలీవుడ్ వర్గాలు టాక్.