ఇటీవల ‘సాక్షి’కి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు
► నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. వయసు పెరుగుతున్నట్టే అనిపించడం లేదు!
(నవ్వుతూ...) ఏం చెప్పమంటారు? ఎవరైనా నా గురించి ఇలా చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. హెల్దీ లైఫ్, హెల్దీ థింకింగ్, బీయింగ్ హ్యాపీ... ఈ మూడూ చాలు! మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది ముఖంలో కనిపిస్తుంటుంది.
► ‘మామ్’ తల్లీకూతుళ్ల రిలేషన్ మీద సినిమా కాబట్టి, ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు గుర్తొచ్చారా?
లేదండీ! ‘మామ్’ చేసినప్పుడు మా అమ్మగారు గానీ, నా పిల్లలు గానీ గుర్తు రాలేదు. దేవకి (సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు) మనసులో ఎంత బాధ ఉంది? పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అనేవి నా మనసులో ఉన్నాయి. దేవకి పాత్రలో ఉన్నంతసేపూ నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రాలేదు.
► మీ చిన్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వరకూ.. మీ అమ్మగారు మిమ్మల్ని గైడ్ చేశారు.. ఆమె గురించి కొన్ని మాటలు...
తప్పకుండా! ఈ రోజు నేను ఏమాత్రం కొంచెం ఎఛీవ్ చేశానన్నా... ఆ క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలి. అమ్మ నన్ను కూర్చోబెట్టి ఏం నేర్పలేదు. కానీ, ఆమె నుంచి జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను. లైఫ్‌లో ఏం చేసినా వంద శాతం కష్టపడాలి. ఊరికే చేయాలని చేయకూడదు. హార్డ్ వర్కింగ్. బీయింగ్ పంక్చువల్ – ఈ లక్షణాలన్నీ అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ‘కష్టే ఫలి. నో పెయిన్–నో గెయిన్’ – ఇలాంటివి నాకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక యాభై శాతం నేను నా పిల్లలకు ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఎచీవ్‌మెంట్ అనుకుంటా.
► నేను కొంచెమే ఎచీవ్ చేశాననడం మీ గొప్పతనం. 50 ఏళ్ల కెరీర్... 300 సినిమాలంటే జోక్ కాదు. మీరు చాలా ఎచీవ్ చేశారు. ఎప్పుడూ అలసిపోలేదా?
ఇప్పుడీ ‘మామ్’ నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఉంది (నవ్వులు). ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో అడుగు పెట్టినట్టు ఫీలవుతున్నా! మీరు చెబుతుంటే ‘300 సినిమాలు చేశానా?’ అనిపిస్తోంది. అదర్ వైజ్... ఐ ఫీల్ లైక్ థిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్.
► మీరెలాంటి మదర్? స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా?
ఫుల్ ఫ్రెండ్లీ. యాక్చువల్‌గా ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి నా పిల్లలు తీసుకు రాలేదు. చాలా తక్కువ సార్లు స్ట్రిక్ట్‌గా ఉంటాను.
► ‘మామ్’ ట్రైలర్‌లో ‘వచ్చాను రా దానమ్మను’ అనే డైలాగ్ చెప్పే టైమ్‌లో మీ కళ్లలో ఆగ్రహం కనిపించింది. మీ పిల్లల గురించి రాకూడని వార్తలు వచ్చినప్పుడు ఓ మదర్‌గా మీరెలా ఫీలవుతారు?
అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. ఐయామ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మై చిల్డ్రన్. మా అమ్మాయి ఓ పార్టీకి వెళ్లొచ్చి, నాకు ఫొటోలు చూపించింది. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రదర్శకురాలు గౌరీ షిండేతో ఆ ఫొటోలు దిగింది. గౌరీ కూడా నాకు ఫోన్ చేసి ‘పాపతో పార్టీలో మాట్లాడాను. తనతో చాలా టైమ్ స్పెండ్ చేశా’ అని చెప్పింది. తర్వాత రోజు పేపర్‌లో మా పాప ఎవరో హీరో వెనకాల, అతను ఎక్కడికి వెళితే అక్కడే తిరుగుతుందని రాశారు. పాప చాలా అప్‌సెట్ అయ్యింది. కానీ, నా పాప గురించి నాకు తెలుసు. నేను అలాంటి వార్తలు చూసి నవ్వుకుంటా. కానీ, కొన్ని వార్తలు మాత్రం నిజంగా బాధకు గురిచేస్తాయి. అలాంటి వార్తలు రాసేవాళ్లు ‘వాళ్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. తల్లి మనసు ఎంత బాధపడుతుంది’ అనేది అర్థం చేసుకోవాలి.
► ‘మామ్’ ట్రైలర్ చూసి, మీ పిల్లలేమన్నారు?
వాళ్లు సినిమా కూడా చూశారు. జాన్వీ అయితే నన్ను గట్టిగా కౌగలించుకుంది. తను అలా చేయడం అదే మొదటిసారి. మా పిల్లలకు సినిమా బాగా నచ్చింది.
► జాన్వీ ఎవరితోనో లవ్‌లో ఉందని, మీరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇంకో న్యూస్ వచ్చింది...
ఇక వాటన్నిటి గురించి మాట్లాడడం వేస్ట్. ముంబయ్‌లో ఇటీవల ఓ పత్రికలో ‘మా పాపకు పెళ్లి చేయాలి’ అని నేను చెప్పినట్టు రాశారు. ప్రతి అమ్మ తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది కదా! నేనూ అదే చెప్పా. కానీ, అంతకు ముందు ‘జాన్వీ ఇండిపెండెంట్‌గా ఎదగాలి. తన కాళ్లపై తను నిలబడాలి. ఊరికే పెళ్లి చేసి కుక్కేయడం కాదు. తనకూ ఓ కెరీర్ ఉండాలి’ అని చెప్పా. అదంతా వదిలేసి ‘శ్రీదేవి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది’ అని రాశారు. దాన్నే హెడ్‌లైన్ చేశారు.
► ఇంట్లో ఆల్రెడీ ఓ సక్సెస్‌ఫుల్ స్టార్ ఉన్నారు కాబట్టి, జాన్వీని మీతో కంపేర్ చేస్తారు. మీరేమంటారు?
జాన్వీ ఎంత పెద్ద స్టార్ అవుతుందనేది మన చేతుల్లో లేదు. తన టాలెంట్, హార్డ్‌వర్క్ బట్టి పైకొస్తుంది. తనింకా ఒక్క అడుగు కూడా వేయలేదు. నాతో తనను కంపేర్ చేయడమనేది చాలా రాంగ్. ఎందుకంటే... నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. హీరోయిన్‌గా పరిచయమయ్యే టైమ్‌కి చైల్డ్ స్టార్‌గా సుమారు 50 సినిమాలు చేశా. హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా చేసే టైమ్‌కి షూటింగ్ ఎలా ఉంటుంది? కెమెరా... వంటివన్నీ తెలుసు. మా పాపకు మాత్రం ‘ఇట్స్ జస్ట్ ఎ ఫస్ట్ ఫిల్మ్’ అన్నమాట. సో, తననూ, నన్నూ కంపేర్ చేయడమనేది న్యాయం కాదు. తనని ఇండివిడ్యువల్‌గా చూస్తే బాగుంటుంది.
► మీ పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. చిన్నమ్మాయి మీకంటే హైట్ అనుకుంటా!
అవునండీ. జాన్వీ కంటే... నాకంటే చిన్న పాప ఖుషీ ఇంకా హైట్!
► ఈ వయసులోనూ మీరింత స్లిమ్‌గా ఉన్నారు. మీ పిల్లలకు మీరేమైనా టిప్స్ ఇస్తారా?
నేనా? అయ్యో... లేదండీ! వాళ్లే నాకు టిప్స్ ఇస్తున్నారు. నేనెప్పుడైనా కొంచెం ఎక్కువ తింటే... ‘మమ్మా! ప్లీజ్ ఆపు’ అంటారు. ఇప్పుడు నాకంటే వాళ్లే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు.
► తెలుగు నుంచి మీ పెద్దమ్మాయికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కదా?
ఏయే ఆఫర్స్ వచ్చాయి. ఎవరెవరు మా అమ్మాయిని నటించమని అడిగారు? అనేవి చెప్పడం నాకిష్టం లేదు. ఏదైనా దర్శక–నిర్మాతలు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారు.
► మీరు ఓ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తే చూడాలనుంది?
నేను తెలుగమ్మాయినే. తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇచ్చింది. నేను ఏనాడూ దాన్ని మర్చిపోను. తెలుగులో చేయాలని నాకూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment