శ్రీదేవి ఇబ్బందుల్లో ఉందని విన్నాం | sridevi babai m. venugopal with sakshi exclusive interview | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ఇబ్బందుల్లో ఉందని విన్నాం– శ్రీదేవి బాబాయ్‌ ఎం. వేణుగోపాల్‌

Published Tue, Feb 27 2018 1:07 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

sridevi babai m. venugopal with sakshi exclusive interview - Sakshi

బంధువులతో శ్రీదేవి, శ్రీదేవి బాబాయ్‌ ఎం. వేణుగోపాల్‌

శ్రీదేవి చిన్నప్పుడు ఇష్టపడి ఏం తినేది? శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూతురు సన్నగా ఉండటం కోసం కడుపు మాడ్చిందా? చెల్లెలు శ్రీలత, శ్రీదేవికి మధ్య విభేదాలు ఏంటి? ఎన్నిసార్లు ముక్కుకి సర్జరీ చేయించుకుంది?
స్టార్‌ అయ్యాక బంధువులను చూసిందా? పెళ్లయ్యాక శ్రీదేవి బంధువులను దూరం పెట్టిందా? సవతి కొడుకు అర్జున్‌ కపూర్‌.. శ్రీదేవిని ఒత్తిడికి గురి చేసేవాడా? ... అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత రేకెత్తిన ప్రశ్నలివి. గుండెపోటుతో ఆకస్మిక మరణం అనే వార్త నుంచి ‘డెత్‌ మిస్టరీ’ అనే టాక్‌ మొదలైంది. ఆమె మరణం పట్ల బంధువులకు ఏమైనా అనుమానాలున్నాయా? శ్రీదేవి బాబాయ్‌ ఎం. వేణుగోపాల్‌తో
‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.


► శ్రీదేవిగారికి మీరు బాబాయ్‌ అవుతారు కదా.. ఆ బంధుత్వం గురించి వివరంగా చెబుతారా?
శ్రీదేవి అమ్మ రాజేశ్వరమ్మ మా అమ్మకు అన్న కూతురు. నాకు వదిన అవుతుంది. శ్రీదేవి వాళ్ల పిన్నమ్మ అనసూయమ్మను మా అన్న (పెదనాన్న కొడుకు)కు చేసుకున్నాం. రాజేశ్వరమ్మ తమ్ముడికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాం. రాజేశ్వరమ్మ సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసేవారు. అప్పుడే శివకాశీలో అయ్యప్పన్‌ని పెళ్లి చేసుకున్నారు. రాజేశ్వరమ్మ పెళ్లికి మేం బంధువలమంతా వెళ్లాం.

► తిరుపతిలో మీ ఇంటి పక్కనే రాజేశ్వరమ్మ ఉండేవారా?
అందరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉండేవి. శ్రీదేవి వాళ్ల ఇంటికి ఒక నాలుగు ఇళ్లు అవతల శ్రీదేవి వాళ్ల పిన్ని (అనసూయమ్మ) ఇల్లు ఉండేది. చిన్నప్పుడు అందరి ఇళ్లల్లో శ్రీదేవి ఆడుకునేది.

► శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌’ కదా. మరి శ్రీదేవిగా ఎవరు మార్చారు?
వాళ్ల నాన్నగారు తమిళియన్‌. కాబట్టి అమ్మయ్యంగార్‌ అని ఏదో పేరు పెట్టారు. మేం మాత్రం ఆ పేరుతో ఎప్పుడూ పిలిచింది లేదు. బంధువులమంతా తనని ‘పప్పీ’ అని పిలిచేవాళ్లం. పప్పీ సినిమాల్లోకి వెళ్లాక తన అమ్మానాన్న ఇద్దరూ కలసి ‘శ్రీదేవి’ అని పెట్టారు.

► శ్రీదేవిగారు యాక్ట్‌ చేసిన సినిమా షూటింగ్స్‌కు మీరు వెళ్లేవారా?
‘గోవిందా గోవిందా’ షూటింగ్‌ తిరుపతిలో జరిగినప్పుడు మేం వెళ్లాం. అప్పుడు శ్రీదేవి గెస్ట్‌ హౌస్‌లో ఉండేది. మేమంతా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి రాత్రి వరకు మాట్లాడి వచ్చేవాళ్లం. ఆ సినిమా తప్ప వేరే ఏ సినిమా షూటింగ్‌కూ వెళ్లలేదు.

► స్టార్‌ అయ్యాక శ్రీదేవి బంధువుల ఇంటికి వచ్చేవారా?
ప్రతి సంవత్సరం ఆగస్ట్‌ 13 తన పుట్టినరోజుకు తిరుపతి వస్తుంది. అప్పుడు బంధువులందర్నీ పిలుస్తుంది. అందరం కలిసి దర్శనానికి వెళ్తాం. ఆ రోజు తిరుపతిలోనే స్టే చేస్తుంది. వీలుంటే ఇంటికి వస్తుంది. ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ అయితే హోటల్‌లో ఉంటుంది. అయితే అంతకు ముందు ఇంటికి వస్తుండేది. క్రమంగా పెద్ద యాక్టర్‌ అయ్యే కొద్దీ ఇంటికి వస్తే.. జనం బాగా వస్తున్నారని హోటల్‌లో ఉండేది. మేమే తనని కలవటానికి వెళ్లేవాళ్లం. ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్లం.

► శ్రీదేవి పెద్ద స్టార్‌ కాబట్టి బంధువులను పట్టించుకునేవారు కాదేమో అనే సందేహం చాలామందికి ఉంది..
ఒక వ్యక్తి గురించి బయటవాళ్ల కంటే వాళ్ల బంధువులకే ఎక్కువ తెలుస్తుంది. నా కొడుకు (ఉమేశ్‌)ని బాగా చూసేది. బాగా ముద్దు చేసేది. మద్రాస్‌ వెళ్లే వరకు వాణ్ణి బాగా చూసుకునేది. వెళ్లిన తర్వాత కూడా ఉమేశ్‌ మద్రాసు వెళుతుండేవాడు. ఇప్పుడు మా ఉమేశ్‌ అమెరికాలో ఉన్నాడు. తనకు కూడా శ్రీదేవి అంటే చాలా ఇష్టం. మేం ఇల్లు కట్టుకుంటుంటే సాయం చేసింది. మార్బుల్స్‌ అవీ పంపించింది. మావాళ్లు ఎవరు ఎప్పుడు వెళ్లినా అంతో ఇంతో సాయం కచ్చితంగా చేస్తుండేది.

► శ్రీదేవిగారి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు ఉండేవని, శ్రీదేవిగారు స్టార్‌గా ఎదగడానికి ఆమె తల్లి మాత్రమే కారణమని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నిజమా?
ఆ మాటలు నిజం కాదు. రాజేశ్వరమ్మ, అయ్యప్పన్‌ బాగుండేవాళ్లు. శ్రీదేవిని షూటింగ్స్‌కి తీసుకెళ్లేవారాయన. భార్య, కూతురిని బాగా చూసుకునేవారు.
 

► తండ్రి చనిపోయినప్పుడు శ్రీదేవిగారు షూటింగ్‌లో ఉండి రాలేదని ఇప్పుడు అనుకుంటున్నారు. మాకు ఆవిడ హాజరైనట్లుగానే తెలుసు..
అప్పుడు శ్రీదేవి హిందీ సినిమా ‘లమ్హే’ షూటింగ్‌లో ఉంది. తండ్రిని చివరిసారిగా చూడ్డానికి మద్రాసు వచ్చింది. దాదాపు పదీ పదిహేను రోజులు షూటింగ్స్‌కి వెళ్లలేదు.

► శ్రీదేవిగారి పెళ్లికి వెళ్లారా ?
చెన్నైలో పెళ్లి రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరం వెళ్లాం.

► బోనీ కపూర్‌గారితో శ్రీదేవిగారి పెళ్లయ్యాక మీకు రాకపోకలు ఉండేవా?
పెళ్లి అవ్వకముందు వరకు బాగానే కలిసేది. పెళ్లయి బాంబేకు వెళ్లిపోయాక కొంచెం రాకపోకలు తగ్గిపోయాయి. మేము వెళ్లడం తగ్గిపోయింది. మేం బాంబే వెళ్లినప్పుడు తను ఉండకపోవచ్చు. బిజీగా ఉండేది. ఏమైనా గానీ ఆగస్ట్‌ 13న తిరుమల వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అందరి బంధువులను కలిసేది. లాస్ట్‌ ఇయర్‌ కూడా మా వాళ్లందరూ వెళ్లారు.

► శ్రీదేవిగారి కుమార్తెలు బంధువులందరికీ పరిచయమేనా?
కూతుళ్లకు మా బాబాయ్, పిన్ని అంటూ మమ్మల్నందర్నీ పరిచయం చేసింది. ముఖ పరిచయం అంతే. వాళ్లకు మన భాష రాదు కదా. అంతా హిందీ, ఇంగ్లీష్‌. అందుకే పిల్లలు, మేం మాట్లాడుకునేవాళ్లం కాదు.
 

► బోనీ కపూర్‌గారు ఎలా ఉంటారు మీతో?
ఆయన బాగానే మాట్లాడతారు. కొంచెం భాష ప్రాబ్లమ్‌ అంతే. కానీ చాలా బాగా మర్యాద ఇచ్చేవాడు. మమ్మల్ని చూడగానే నమస్కారం పెడతాడు.

► మీ ముందు పెరిగిన అమ్మాయి ‘ఆల్‌ ఇండియా స్టార్‌ అవుతుంది’ అని ఊహించారా?
అనుకోలేదు. మా రంగంపేటలో ఉన్నప్పుడు చిన్న పాపగా ఉండేది. నాలుగేళ్ల వయసులోనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది కదా. అప్పుడు మద్రాసు వెళ్లిపోయారు. శ్రీదేవి నటిగా ఎంత పెద్ద రేంజ్‌కి వెళుతుందని ఊహించడానికి మేం తన షూటింగ్స్‌కి వెళ్లలేదు కదా. అయితే మన బిడ్డ అంత పెద్ద పొజిషన్‌కి వెళ్లిందంటే మాకు సంతోషం. శ్రీదేవి బంధువులం అని చెప్పుకోవటం మాకు గొప్ప.

► చిన్నారి శ్రీదేవి ఇష్టపడి ఏం తినేది?
చికెన్, మటన్‌ బాగా తినేది. నాన్‌ వెజ్‌ అంటే బాగా ఇష్టపడేది.

► కానీ శ్రీదేవి తల్లి ఆమెను సరిగ్గా తిననిచ్చేవారు కాదట.. నిజమేనా?
సిటీల్లో దాదాపు అందరూ తక్కువే తింటారు కదా. మాకు తెలిసి కూతుర్ని మరీ అంత కట్టడి చేయలేదు. అయితే ఆపరేషన్‌లు అవీ చేయించుకున్నాక శ్రీదేవి తిండి బాగా తగ్గించింది.

► ఆపరేషన్లు అంటున్నారు. ఏం ఆపరేషన్లు. ఎన్ని?
ముక్కు ఆపరేషన్‌ చేయించుకుంది కదా. మాకు తెలిసి మూడుసార్లు చేయించుకుంది. అవి చేయించుకున్నాక తిండి తగ్గించింది.

► సర్జరీలు వద్దు అని చెప్పే అవకాశం మీకు ఉండేది కాదేమో?
రాజేశ్వరమ్మ ఉన్నప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్లం. ఆవిడ పోయాక రాకపోకలు కూడా తగ్గాయి కాబట్టి, సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేకుండాపోయింది.

► శ్రీదేవిగారి మరణ వార్త విన్న తర్వాత మీ బంధువులెవరైనా బాంబే వెళ్లారా?
మా ఆవిడ, ఇంకొంతమంది బంధువులు వెళ్లారు. ముందు శ్రీదేవి వాళ్ల ఇంటికి వెళ్లారు. కొంతసేపు ఉండి హోటల్‌లో రూమ్‌ తీసుకుని ఉంటున్నారు.

► శ్రీదేవిగారి మరణం పట్ల చాలామందికి అనుమానాలున్నాయి. మీకేమైనా అనుమానం?
అక్కడ ఏం జరిగిందో మాక్కూడా తెలియదు. అందరిలాగా టీవీల్లో చూడటమే.

► ఎప్పుడైనా శ్రీదేవిగారు బాధపడుతున్నట్లు అనిపించిందా? మీతో ఏమైనా చెప్పుకున్నారా?
మా దగ్గరేం చెప్పలేదు కానీ, బోనీ కపూర్‌గారి పెద్ద భార్య కొడుకు (అర్జున్‌ కపూర్‌) కొంచెం ఇబ్బంది పెడతాడని బంధువులతో ఓసారి చెప్పి, బాధపడిందని విన్నాం.

► అంటే.. పైకి నవ్వుతూ కనిపించిన శ్రీదేవిగారి మనసులో బాధ ఉందంటారా?
ఉండేదేమో అనిపిస్తోంది. ముఖ్యంగా భర్త ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన పడేదట. ఒకసారి ఆయనకు బాగా షుగర్‌ పెరిగిపోతే ఏమైపోతాడో.. పిల్లలు, తనూ ఏమైపోతామేమోనని చాలా బాధపడిందట. అలా అని మా బంధువులు చెబితే తెలిసింది.

► శ్రీదేవిగారు సున్నిత మనస్కురాలని చాలామంది అన్నారు.. మీరేమంటారు?
మంచి అమ్మాయి. ఎవరితోనూ గొడవలున్నట్లు మాకు తెలియదు.
 

► మరి.. చెల్లెలు శ్రీలతకూ, శ్రీదేవిగారికీ మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి కదా. అసలప్పుడు ఏం జరిగింది?
అవి ఆస్తి గొడవలు కాదు. రాజేశ్వరమ్మ ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఆపరేషన్‌ జరిగింది కదా. అప్పుడు ఒకచోట చేయాల్సిన ఆపరేషన్‌ని మరోచోట చేశారు. దాంతో ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆ హాస్పటల్‌పై కేస్‌ పెట్టారు. హాస్పటల్‌ డబ్బు విషయంలో అక్కచెల్లెళ్లిద్దరికీ ఏవో మనస్పర్థలు వచ్చాయి. అంతకు మించి ఏమీ లేదు.
 

► ఆ తర్వాత ఇద్దరూ మామూలుగానే ఉండేవారా?
బాగానే ఉండేవారు. మొన్న బోనీ కపూర్‌గారి బంధువు పెళ్లికి శ్రీలత కూడా దుబాయ్‌ వెళ్లింది. ఆ ఫంక్షన్‌ అయ్యాక శ్రీలత వచ్చేసింది. అక్క చనిపోయిందని తెలిసి బాంబే వెళ్లింది.

► శ్రీదేవిగారు చాలా త్వరగా చనిపోయారు. మీ కళ్ల ముందు పెరిగిన పిల్ల ఇలా ఆకస్మిక మరణం పొందడం బాధగా ఉండి ఉంటుంది..
మేమంతా చాలా బాధపడ్డాం. చనిపోదగ్గ వయసు కాదు. ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. కూతురి సినిమాని కళ్లారా చూసుకోలేకపోయింది. అందరూ ఆరాధించే శ్రీదేవి మా కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం మాకు గర్వకారణం. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

‘‘బంధువులను చూడ్డానికి వచ్చినప్పుడు శ్రీదేవిగారు గిఫ్ట్స్‌ అవీ తెచ్చేవారా?
తెచ్చేది. అలాంటి విషయాల్లో వెనకాడేది కాదు. దేవుడి  దయ వల్ల మేం బాగానే ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు. మా కుటుంబానికి చెందిన అమ్మాయి ఇలా దేశం కాని దేశంలో హఠాత్తుగా చనిపోవడం మా అందరికీ ఎప్పటికీ తీరని బాధ మిగిల్చింది.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement