
నాకు నచ్చనది అదే: రజనీకాంత్!
చెన్నై: తనకు నచ్చని విషయాల్లో వర్క్ హాలిడే ఒకటని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళసినిమా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి మధ్య వేతనాలు, విధి విధానాల విషయంలో విభేదాల కారణంగా ఫెఫ్సీ సమ్మెకు దిగడంతో మంగళవారం నుంచి చాలా వరకు చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి బృందం నిన్న ఉదయం నటుడు రజనీకాంత్‌ను కలిసి పరిస్థితులను వివరించారు. దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ ఇరు సంఘాల వారు సామరస్య చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తనకు నచ్చని కొన్ని విషయాల్లో పని నిలిపివేయడం ఒకటన్నారు. ఎలాంటి సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్‌కే.సెల్వమణి మాట్లాడుతూ మంగళ, బుధవారం 40కి పైగా చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయని, అందులో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కూడా ఉందని పేర్కొన్నారు. కాలా షూటింగ్‌లో 150 మంది పని చేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రజనీని కలిసి పరిస్థితి వివరించామన్నారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నా ఓపిగ్గా సమస్యను విన్నారని ఆర్‌కే.సెల్వమణి తెలిపారు.