
తండ్రితో రామ్‌సే బ్రదర్స్
బాలీవుడ్‌లో హారర్ చిత్రాలను పాపులర్ చేసింది దర్శకులు రామ్‌సే బ్రదర్స్ అంటారు. వీరిని హారర్ బ్రదర్స్ అని కూడా పిలుస్తారు. ‘వీరానా, పురానీ హవేలీ, బంద్ దర్వాజా’ వంటి హారర్ చిత్రాలతో 1980ల కాలంలో ప్రేక్షకులను భయపెట్టారు రామ్‌సే బ్రదర్స్. ఇప్పుడు వాళ్ల కథే స్క్రీన్ మీదకు రాబోతోంది. ఈ బయోపిక్‌ను నటుడు అజయ్ దేవగన్ నిర్మిస్తారు. రామ్‌సే బ్రదర్స్ జీవితకథను సినిమాకు అనుగుణంగా మలిచే హక్కులను అజయ్ తీసుకున్నారు. రితేష్ షా ఈ కథను రచిస్తున్నారు.
మూడు తరాల రామ్‌సే ఫ్యామిలీ కథ, వాళ్ల కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. ఇందులో అజయ్ దేవగన్ యాక్ట్ చేయరని తెలిసింది. ఇంతకీ రామ్‌సే బ్రదర్స్ అంటే ఇద్దరే అనుకుంటారేమో. వీళ్లు మొత్తం ఏడుగురు. కుమార్ రామ్‌సే, కేషు రామ్‌సే, తులసీ రామ్‌సే, కరణ్ రామ్‌సే, శ్యామ్ రామ్‌సే, గంగూ రామ్‌సే, అర్జున్ రామ్‌సే. వీళ్లు దర్శకులు, నిర్మాతలు, ఎడిటర్లుగా వ్యవహరించారు. ఇటీవలే శ్యామ్ రామ్‌సే చనిపోయారు. ఈయన్ని ‘హారర్ సినిమాలకు బాద్‌షా’ అని అంటారు. రామ్‌సే బ్రదర్స్‌లో మరో సోదరుడు తులసీ రామ్‌సే గత ఏడాది కన్నుమూశారు.