
నాగార్జున
‘‘దేవదాసు’ అనేది మనందరికీ బాగా పరిచయం ఉన్న టైటిల్. ఈజీగా కనెక్ట్ అవుతుంది అని పెట్టాం. అలాగే ఆ ‘దేవదాసు’కి ఈ ‘దేవదాస్’కి ఓన్లీ మందు బాటిలే కామన్. మిగతా అంతా వేరే’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. అశ్వనీదత్ నిర్మించారు. గురువారం ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నాగార్జున పలు విశేషాలు పంచుకున్నారు.
► చాలా రోజుల తర్వాత డాన్ పాత్ర చేస్తున్నాను. కానీ డాన్ చేసే పనులేవీ చేయను. అంతా కామెడీనే. సినిమా మొత్తం నవ్వులే. నానీకి పేషెంట్‌లా వెళ్తాను. నాని, నేను ఫ్రెండ్స్ అవుతాం. కథ అంతా మా చుట్టూనే తిరుగుతుంది.
► నా లవ్‌స్టోరీ నానీనే సెట్ చేస్తాడు. బేసిక్‌గా దాస్ (నాని) ధైర్యవంతుడు. కానీ తను ప్రేమించిన అమ్మాయి ముందు ఏం మాట్లాడలేడు. రాజ్ కుమార్ హిరాణి ‘మున్నాభాయ్ యంబీబీయస్’ లాంటి స్టైల్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఈ కథను బాలీవుడ్ రచయిత శ్రీధర్ రాఘవన్ రెండేళ్ల క్రితమే చెప్పాడు. అప్పుడు నుంచి అటు ఇటు తిరుగుతూ మళ్లీ నాకే వచ్చింది.
► నా పక్కన చాలా రోజుల తర్వాత హీరోయిన్ కనబడుతుంది. అందుకే మళ్లీ రొమాన్స్ అంటూ ట్వీట్ చేశాను కూడా (నవ్వుతూ). నాని పర్సనల్‌గా తెలియకపోయినా సెట్స్‌లో చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. తన సినిమాలు చూశాను. చాలా సహజంగా నటిస్తాడు. తన సినిమాలు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. నాకు రియలిస్టిక్ సినిమాలంటే అస్సలు నచ్చవు. ఆల్రెడీ రోజు చూస్తుంది అదే కదా. సినిమాల్లో కొంచెం మ్యాజిక్ ఉండాలి.
► 32 రెండేళ్లుగా సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా పని లేకుండా తిరగడం, లేదా ఉద్యోగం చేయడం, లవ్ చేయడం.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాం? అందుకే మల్టీస్టారర్ సినిమాలు వస్తే చేస్తున్నాను. ‘దేవదాస్, హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ , ధనుశ్ సినిమాలు చేస్తున్నాను.
► మల్టీస్టారర్ సినిమాలు సేఫ్ అని కూడా కాదు. అలా అని ఏ పుస్తకంలోనూ లేదు. సోలో సినిమాలో ఒక్కరి మీదే ఒత్తిడి ఉంటుంది. అదే మల్టీస్టారర్‌లో ఇద్దరికీ సమానం అవుతుంది. గట్టిగా మాట్లాడితే మల్టీస్టారరే ఇంకా ప్రెషర్. ‘ఇద్దరు కలసి హిట్ కొట్టలేకపోయార్రా’’ అంటారు.
► వైజయంతీ, నాని కథ విని నా దగ్గరకు పంపారు. నలుగురైదుగురు రైటర్స్ కూర్చొని వర్క్ చేశారు. ‘దేవదాస్’ ఏ ఒక్కరి సినిమా కాదు. ఇది టీమ్ ఎఫర్ట్. శ్రీరామ్ ఆదిత్య చేసిన ‘శమంతకమణి’ సినిమా చూశాను. స్క్రీన్ ప్లే బావుంటుంది.
► నా ఏజ్ గ్రూప్ యాక్టర్స్‌తో కలసి సినిమా చేస్తే మీకే బోరింగ్‌గా ఉంటుంది. ‘ముసలోళ్లంతా కలసి సినిమాలు తీశార్రా’ అని రాస్తారు. మనం వయసు మించిపోతున్నాం అని ఆలోచించడం మొదలుపెట్టిన నిమిషం ఇంక అంతే. రోజూ నిద్ర లేవడమే యంగ్ అనే ఫీల్‌తో లేస్తాను. నా వయసు 59 కావచ్చు. మనసు మాత్రం 25. అఖిల్, చైతన్యలానే ఆలోచిస్తా కాబట్టే వాళ్లను డీల్ చేయగలుగుతున్నాను. ఏదైనా మన మనసుని బట్టే ఉంటుంది. ఎనర్జీ అంతా అక్కడి నుంచే వస్తుంది.
► మా ఫ్రెండ్స్ ఈ మధ్య నాతో ‘‘నువ్వు కొత్త ఫ్రెండ్స్‌ని చూసుకో. నీ ఏజ్ గ్రూప్ వాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేసుకో అంటున్నారు’’ (తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించడంతో అలా అంటున్నారు). నేను 59 అని ఆలోచించను కూడా. ఇప్పటికీ చైతన్య కంటే యంగ్ అనే భావిస్తాను.
► వైజయంతీ మూవీస్‌తో నా అనుబంధం ‘ఆఖరి పోరాటం’ సినిమా నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు శ్రీదేవిని తీసుకువచ్చారు. అప్పటికే ‘మిస్టర్ ఇండియా’ రిలీజై శ్రీదేవి పీక్‌లో ఉంది. నేనేమో సన్నగా ఉన్నాడు, గొంతు బాలేదు అనే కామెంట్స్‌తో ఉన్నాను. నాన్నగారి ద్వారా నన్ను ఈ సినిమాకు ఒప్పించారు దత్‌గారు. పాపులర్ వాళ్లతో యాక్ట్ చేస్తే మనం కూడా పాపులర్ అవుతాం అన్నారు. దత్‌గారితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో నేనే. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. ‘ఈ సినిమా ద్వారా కమ్‌బ్యాక్ అవుతున్నాను. మీరు చేయాలి’ అన్నారు. నా సొంత సినిమాలా భావించి చేశాను.
► నానీ ఊరికే ఫోన్ చూస్తూనే ఉంటాడు. అది అలవాటు కూడా కాదు.. అడిక్షన్. యూత్ అనే కాదు ఎవరి చేతుల్లో చూసినా సెల్‌ఫోనే. దానికి ట్రీట్‌మెంట్ కూడా లేదనుకుంటాను.
► ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో సుమంత్ లుక్ చూశాను. అచ్చు మా నాన్నగారిలానే ఉన్నాడు. నాన్నగారికి, సుమంత్‌కి పోలికలు దగ్గరగా ఉంటాయి.
► నెక్ట్స్ ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదు. బంగ్రారాజు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ కూడా ఓ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ‘మన్మథుడు 2’ టైటిల్ బావుంది కదా అని రిజిస్టర్ చేయించాను. రాహుల్ స్క్రిప్ట్‌కి సూట్ అయితే అదే. లేకపోతే చైతన్యకో, అఖిల్‌కో పనికొస్తుంది కదా.
► బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో చేస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’లో ఇంకా కొన్ని రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ధనుశ్ డైరెక్షన్‌లో చేయబోయేది పీరియడ్ ఫిల్మ్. 600 సంవత్సరాల క్రితం రోజుల్లో పాత్ర నాది. షూటింగ్‌లో ఇంకా జాయిన్ అవ్వలేదు.
► ‘ఆఫీసర్’ సినిమా చేసినందుకు రిగ్రెట్ లేదు. అది పూర్తిగా నా చాయిస్. కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్‌లో ఎగై్జటింగ్‌గా అనిపించొచ్చు. కానీ ఆడకపోవచ్చు.
► నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ బయోపిక్ కోసం అడిగారు. రాజ్యాంగాన్ని రాసిన ఒక వ్యక్తి పాత్ర అది. చాలా బావుంది స్క్రిప్ట్. కానీ డేట్స్ లేక వదులుకోవాల్సి వచ్చింది.
► సెప్టెంబర్ మా నెల. నాన్నగారి బర్త్‌డే మంత్ కావడంతో సెప్టెంబర్ మా అందరి ఫేవరెట్. ఈ నెలలోనే చైతూ బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. కోడలు సమంత హిట్ కొట్టింది. అఖిల్ ‘మజ్ను’ టీజర్ చాలా బావుంది. సుమంత్ లుక్‌కి అభినందనలు వస్తున్నాయి. సో.. నాన్నగారు మా అందర్నీ బాగా చూస్తున్నారు.
► అఖిల్, కరణ్ జోహార్ బెస్ట్ ఫ్రెండ్స్. అఖిల్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తాను అంటుంటాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పిన మాట వినకుండా ఓ సినిమా (తెలుగు) కు తొందరపడ్డాడు. తను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ‘శివ’ సినిమా ద్వారానే బాలీవుడ్‌కి వెళ్లాను. రైట్ స్క్రిప్ట్, రైట్ టైమ్‌లో తనూ వెళతాడు.
‘దృశ్యం’ వంటి సినిమాలు చేస్తారా? ఇద్దరు పిల్లలకు తండ్రి పాత్ర అంటే మీకు ఓకేనా? అన్న ప్రశ్నకు – ‘‘ఇద్దరి పిల్లలకు తండ్రిగా నేనెందుకు చేయాలి? నాకు పిల్లలు లేరు, తమ్ముళ్లే ఉన్నారు (చైతూ, అఖిల్‌ని ఉద్దేశిస్తూ). నేనిప్పటికీ 25లాగే ఆలోచిస్తా’’ అని సరదాగా అన్నారు నాగార్జున.
Comments
Please login to add a commentAdd a comment