మల్టీస్టారర్‌ అంటే ఇగో ఉండకూడదు | Akkineni Nagarjuna Emotional Speech at Devdas Movie Success meet | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్‌ అంటే ఇగో ఉండకూడదు

Published Sat, Oct 6 2018 1:29 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Akkineni Nagarjuna Emotional Speech at Devdas Movie Success meet - Sakshi

అశ్వినీ దత్, నాగార్జున, శ్రీరామ్‌ ఆదిత్య

‘‘దేవదాస్‌’ విడుదల టైమ్‌లో నేను ఇక్కడ లేను. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కి వెళ్లా. ఆ ట్రిప్‌ చాలా సరదాగా జరిగింది. ‘శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్, దేవదాస్‌’ వంటి మూడు సక్సెస్‌ఫుల్‌ సినిమాలు సెప్టెంబర్‌లో విడుదలవడంతో పాటు, అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ టీజర్‌ రిలీజ్‌ కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంత సంతోషంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లామో అంతే సంతోషంగా తిరిగొచ్చాం’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా రష్మికా మండన్న, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్స్‌గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్‌’.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘దేవదాస్‌’ సినిమా వారానికే 41కోట్ల రూపాయల గ్రాస్‌ వసూలు చేసిందంటే సంతోషంగా ఉంది. కుటుంబమంతా హాయిగా నవ్వుతూ చూడదగ్గ చిత్రమిది. డాక్టర్‌ దాస్‌ పాత్రలో నాని లీనమయ్యాడు. మల్టీస్టారర్‌ సినిమా అంటే ఇగో ఉండకూడదు. నీ రోల్, నా రోల్‌ అనుకుంటే సినిమా చెడిపోద్ది.

సినిమా బావుంటే మనం బాగుంటాం అనుకుని నేను, నాని చేయబట్టే మా మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. శ్రీరామ్‌ ఆదిత్యకు మంచి భవిష్యత్‌ ఉంది. ‘ఆఖరి పోరాటం’ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా గ్రాండ్‌గా ఉండాలంటూ అశ్వినీదత్‌గారు డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారితో పోట్లాడేవారు. ఇప్పటికీ ఆయనకు అదే ప్యాషన్‌ ఉంది. ఎప్పటికీ వైజయంతీ మూవీస్‌ పతాకం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఎన్టీ రామారావుగారు శంఖం  ఊదుతూనే ఉంటారు. ‘దేవదాస్‌’ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్‌ మూవీ అంటున్నారు.

ఆయనకు కమ్‌ బ్యాక్‌ మూవీ ఏంటండీ? ఎన్ని హిట్స్‌ లేవు. ‘మహానటి’ కూడా సూపర్‌హిట్టే. ‘డాన్‌’ దేవ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించిన విధానం బాగుంది. ఇలాంటి పాత్రలు మరికొన్ని చేయొచ్చనే భరోసా ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ‘శివ’ సినిమా విడుదలై అప్పుడే 29ఏళ్లు అయిందా? అని పొద్దున్నే అనిపించింది. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చాలా రికార్డులు సాధించింది. ‘అల్లరి అల్లుడు’ సినిమా మాస్‌లోకి తీసుకెళ్లింది’’ అన్నారు.

‘‘భారతదేశ చలన చిత్ర చరిత్రలో అధిక మల్టీస్టారర్‌ చిత్రాలు చేసిన ఘనత ఎన్టీఆర్‌–ఏఎన్‌ఆర్‌లదే. వారితో మా బ్యానర్‌లో 14 సినిమాలు చేస్తే రెండు మూడు మినహా అన్నీ హిట్లే. తెలుగులో ఎక్కువ మల్టీస్టారర్‌ చిత్రాలు తీసిన ఘనత మాదే. కర్నాటకలో మా ‘దేవదాస్‌’ వారానికి 2కోట్ల 37లక్షల షేర్‌ రాబట్టింది’’ అన్నారు అశ్వినీదత్‌. ‘‘దేవదాస్‌’ చేసే అవకాశమిచ్చిన అశ్వినీదత్, నాగార్జున, నానిగార్లకు థ్యాంక్స్‌. ప్రేక్షకులతో కలిసి ఆరేడుసార్లు ఈ సినిమా చూశా. బాగా కనెక్ట్‌ అవుతున్నారు’’ అన్నారు శ్రీరామ్‌ ఆదిత్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement