నాని, ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా, టి. సుబ్బిరామి రెడ్డి, అశ్వనీదత్, నాగార్జున, శ్రీరామ్ ఆదిత్య
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు.
నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది.
చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్‌గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి.
‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు.
నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే.
లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్‌లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్‌బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు.
‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను.
నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు.
వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్‌గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ.
Comments
Please login to add a commentAdd a comment