తన మహోన్నత నటనతో సుదీర్ఘ తెలుగు సినీచరిత్రను ప్రభావితం చేశారు అక్కినేని. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతయ్యగా, కాళిదాసుగా, జయదేవుడిగా, రామకృష్ణుడిగా, అభిమన్యుడుగా, విప్రనారాయణుడిగా, తుకారాంగా, కబీరుగా ఒకటేమిటి... వందలాది పాత్రలతో తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్న కథానాయకుడు అక్కినేని. తన అభినయ కౌశల్యంతో ప్రాణం పోసిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నో! ఆయన పాటలన్నీ మన బ్రతుకున బ్రతుకుగా, మనసున మనసుగా పెనవేసుకుపోయినవే! స్థాలీపులాక న్యాయంగా వ్యాసం, సంజాయిషీగా జాబితా...
అమర ప్రేమికులైన ‘లైలా మజ్నూ’ల గాథ పలుమార్లు వెండితెరను అలంకరించినా, తెలుగులో మాత్రం ఒకే ఒక్క పర్యాయం తెరకెక్కింది. అదే ‘భరణీ’వారి ‘లైలా మజ్నూ’ (1949). సూఫీ సిద్ధాంతం ప్రకారం, లైలా మజ్నూ పరమాత్మ జీవాత్మలకి ప్రతీకలు! లైలా తనకి దూరమవుతున్నప్పుడు, ‘‘పయనమయే ప్రియతమా! నను మరిచిపోకుమా’’ అని పరితప్త హృదయంతో వీడ్కొలుపుతాడు. ఇది అతని ప్రణయోన్మాదపు ప్రాథమిక దశ! మజ్నూ ముఖంలో దైన్యం, నైరాశ్యం నిండి ఉంటాయి. అతని నేత్రాలలో నాయికారాధనతో ఏదో అలౌకికానందం ప్రతిఫలిస్తూంటుంది. నాగేశ్వరరావు ముఖంలోను, కళ్లల్లోను ఆయా భావాలను అద్భుతంగా ప్రదర్శిస్తాడు.
పార్వతి, ‘దేవదాసు’(1953) కూడా అమర ప్రేమికులే! ప్రేయసి ‘పారూ’ ఎడబాటుతో తాగుబోతుగా మారిన దేవదాసు శారీరక, మానసికావస్థలను నాగేశ్వరరావు గొప్పగా ప్రేక్షకుల ముందుంచారు. లైటు స్తంభం క్రీనీడన, దారినపోయే కుక్కపిల్లను నిమురుతూ, చెత్తకుండీ పక్కన కూర్చుని, దగ్గేటప్పుడు గుండెను పట్టుకునే తీరు... ‘నాగేశ్వరరావు నట జీవితానికి ‘దేవదాసు’ పాత్ర కలికితురాయి’ అని ‘జగమే మాయ’ అనే ఒక్క పాటతోనే నిరూపించవచ్చును.
1953లోనే నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘బ్రతుకు తెరువు’ వచ్చింది. ఒక వివాహితుడు తన ఉద్యోగార్థం, ఒక శ్రీమంతురాలిని అవివాహితునిగా మోసం చేయవలసి రావడం ఈ చిత్ర కథావస్తువు. అంతరాత్మ అంగీకరించకపోయినా, అవసరార్థం అబద్ధాల బతుకు సాగించే కథానాయకునిగా నాగేశ్వరరావు చాలా సున్నితంగా, మోతాదును మించని స్థాయిలో నటించి, విమర్శకుల ప్రశంసలను అందుకోగలిగారు. ‘అందమే ఆనందం’ పాట సందర్భాన నాగేశ్వరరావు ప్రదర్శించిన నటన అతి మనోహరం! అందం, ఆకర్షణీయమైన మగటిమి కలిగినా, నాయిక మీద వేరే దృష్టి లేని నాయకుని సంస్కారం, అతని శారీరక భాష రూపేణా ఈ పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
‘విప్రనారాయణ’(1954)లో శ్రీరంగనాథ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షిస్తూ, ‘పాలించరా రంగా’ అంటూ పాడే సమయాన ప్రఫుల్లిత నేత్రాలలో తొణికిసలాడే భక్తి పారవశ్యాన్ని చూసినవారెవరైనా, ఆయన నాస్తికుడంటే నమ్మలేరు! భక్తి మనోగతమైనా, శారీరక భాష ద్వారా అది ప్రకటితమయ్యే తీరును నాగేశ్వరరావు బాగా ఆకళింపు చేసుకోగలిగారు కాబట్టే, ఆయన మహానటుడు కాగలిగారు. 1955నాటి ‘అర్ధాంగి’లో మేదకుడైన తన భర్తను ప్రయోజకునిగా తీర్చిదిద్దడం ఈ చిత్రంలో కథావస్తువు. గది బయటి ఆకర్షణలు నాయకుని వివశుని చేస్తూండగా, ‘‘వద్దురా కన్నయ్యా!’ పాటని ఆలపిస్తుంది.
ముఖంలో అవివేకంతో కూడిన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే, కళ్లల్లో ద్వైదీ భావ సంఘర్షణను ప్రకటించిన తీరు అత్యద్భుతం! 1955లోనే వచ్చిన ‘దొంగరాముడు’లో దాదాపు సినిమా అయిపోయే సమయాన ‘చిగురాకులలో చిలకమ్మా’ యుగళ గీతం వస్తుంది. నౌకరుగా, డ్రైవరుగా ఉద్యోగాలు చేసిన రాముడు, ఈ పాట దగ్గర డాబుసరిగా సూటను ధరిస్తాడు. కూరలను అమ్ముకునే సీత అతని ప్రేయసి. సూటు అలవాటు లేనివాడు ధరించినప్పుడు, అతగాడి మేనరిజమ్స్ ఏవిధంగా ఉంటాయో, ఈ పాటలో ప్రదర్శిస్తారు. ఎంతో కష్టపడి అలవరుచుకున్న బాడీ లాంగ్వేజ్, నిలుచునే భంగిమ ఆ పాత్ర ప్రవర్తన రీతిని పట్టిచ్చే విధంగా ఉండటం విశేషం! 1956లో వచ్చిన ‘భలేరాముడు’లో కూడా నాగేశ్వరరావు దొంగ పాత్రనే ధరించారు. దొంగతనం చేసి తెచ్చిన ఆభరణాన్ని తన ప్రేయసికి అలంకరింపనెంచిన
నాయకుడు, నిదురిస్తూన్న ఆమె సౌందర్యాన్ని చూసి, మంత్రముగ్ధుడై, ఈ గీతమాలపిస్తాడు. ప్రకృతిని అనుశాసించే ప్రేమ తమకాన్ని ‘ఓహో మేఘమాలా!’ పాటలో సాధించగలిగారు.1956లో విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’లో వికటకవిగానే కాక, దేశభక్తి ప్రపూర్ణుడిగా రామకృష్ణుని దర్శకుడు బి.ఎస్.రంగా కొత్త కోణంలో చూపించారు. ‘‘చేసేది ఏమిటో చేసేయి సూటిగా’ అని పాడుతూ, పాదుషాని ఆకట్టుకొని, రాజ్యాన్ని రక్షించుకోగలుగుతాడు. నాగేశ్వరరావు నడిచే పద్ధతి, మాట తీరు ముసల్మానుల జీవన విధానాన్ని ప్రతిఫలించేలా ఉంటాయి. పాట పాడే సమయాన, పాదుషా వస్తున్నాడేమోనని దొంగ చూపులు చూస్తూ, మొక్కను అతను నాటే విధానం, అక్కినేని అసమాన ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది. ‘తోడికోడళ్ళు’(1957) శరత్ రచించిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా రూపొందింది. నాయకుడు చదువులో వెనుకబడి ఉన్నా, ప్రగతి భావాలలో ముందుంటాడు. ‘‘కారులో షికారుకెళ్లే’ పాటలో గాంభీర్యం మూర్తీభవించిన కవిగా కనిపిస్తారు ఏఎన్నార్.1957లోనే వచ్చిన ‘మాయాబజార్’లో అభిమన్యుడి పాత్రలో ప్రణయవశాన, వియోగ బాధలో వివశుడై, ‘నీ కోసమె నే జీవించునది’ అని విరహ గీతాన్ని ఆలపిస్తాడు. తన హావభావాల ద్వారా ఒక అసహాయ శూరుని నిస్సహాయ స్థితిని, దైన్యాన్ని చక్కగా ప్రతిఫలింపజేశాడు.
1958లో వచ్చిన ‘భూ కైలాస్’లో త్రికాలజ్ఞుడైన నారదుడు, విష్ణువును శపించిన పార్వతి పరితపిస్తూంటే, ఇతను ఆమెను అనునయిస్తూ, ‘రాముని అవతారం’ పాడతాడు. ఆలపించే సమయాన, భవిష్యద్దర్శనాన్ని చేస్తూన్న ఆ మౌని కళ్లల్లోని వింత కాంతులను, నాగేశ్వరరావు అద్భుతంగా ప్రతిఫలింపజేశారు.
ఇదే ఏడాదిలో విడుదలైన ‘చెంచులక్ష్మి’లో ‘చెట్టు లెక్కగలవా ఓ నరహరి’ యుగళ గీతంలోనూ, ‘భార్యభర్తలు’ చిత్రంలో ‘ఏమని పాడెదనో’ అని పాడుతున్నప్పుడూ నాగేశ్వరరావు అభినయం అనితర సాధ్యం!
‘జయభేరి’, ‘బాటసారి’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మహాకవి కాళిదాసు’, ‘భక్త తుకారాం’ వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలలోని పాటల్లో ఆయన మహోన్నతమైన నటనను ప్రదర్శించి, ప్రేక్షకులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ఈ సంగతులన్నింటినీ సాఫల్యంగా వివరించినట్లయితే, అదో బృహద్గ్రంథం అవుతుంది. ఓపిక, తీరిక ఉన్నప్పుడు అటువంటి గ్రంథ రచనకి ఉపక్రమించడం శుభకరం!
ఏయన్నార్ టాప్ సాంగ్స్
ఈ జాబితా కూడా మన ఉల్లాసం కోసమే గానీ... మిగతా పాటలు తక్కువని కాదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు చెంచాతో సముద్రాన్ని తోడ శక్యమా?
ఖుషీ ఖుషీగా నవ్వుతూ - ఇద్దరు మిత్రులు
ఈ నల్లని రాలలో - అమరశిల్పి జక్కన
నిన్నలేని అందమేదో - పూజాఫలం
చామంతి ఏమిటే ఈ వింత - ఆత్మీయులు
వాడిన పూలే వికసించెనె - మాంగల్యబలం
ఓ బాటసారి నను మరువకోయి - బాటసారి
నీ సుఖమే నే కోరుకున్నా - మురళీకృష్ణ
కాదు సుమా కల కాదు సుమా - కీలుగుర్రం
ప్రేమ యాత్రలకు బృందావనము - గుండమ్మ కథ
నా కంటి పాపలో నిలిచిపోరా - వాగ్దానం
కలకానిది విలువైనది - వెలుగు నీడలు
మనసు పరిమళించెనే - శ్రీకృష్ణార్జున యుద్ధం
కలిసె నెలరాజు కలువ చెలిని - అనార్కలి
హాయిహాయిగా ఆమని సాగే - సువర్ణసుందరి
ఘనా ఘన సుందరా - భక్త తుకారాం
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన - మేఘ సందేశం
శిలలపై శిల్పాలు చెక్కినారు - మంచి మనసులు
ముద్దబంతి పూవులో - మూగమనసులు
చిటపట చినుకులు పడుతూ ఉంటే - ఆత్మబలం
సిగలోకి విరులిచ్చి - సుమంగళి
ఎవరి కోసం ఎవరి కోసం - ప్రేమనగర్
కనుగొంటిని హరిని - చక్రధారి
ఉదయ కిరణ రేఖలో - శ్రీవారి ముచ్చట్లు
ఆగదు ఏ నిమిషము నీ కోసము - ప్రేమాభిషేకం
మల్లెపూల మారాణికి - అమరజీవి
- డా॥కంపల్లె రవిచంద్రన్