
అమ్మే నాకు స్ఫూర్తి: అక్కినేని నాగేశ్వరావు
టాలీవుడ్ తొలితరం అగ్రశ్రేణి కథానాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావుది ప్రముఖ స్థానం. వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నాగేశ్వరరావు శుక్రవారం 90వ ఏట అడుగు పెడుతున్నారు. తన సినీ జీవితంలో 70 ఏళ్ల ప్రస్థానాన్నిగుర్తు చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన జీవితంలో అత్యంత స్ఫూర్తి ప్రధాత అమ్మేనని చెప్పారు. తాను చిన్నతనంలోనే కళారంగం వైపు రావడానికి అమ్మ ప్రోత్సహించారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక సినీ రంగంలో దర్శకుడు ఘంటసాల బలరామయ్య తనపై ఎక్కువ ప్రభావం చూపారని చెప్పారు. 1944లో విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి తనను తీసుకెళ్లి 'సీతారామ జననం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఇచ్చారని తెలిపారు.
సినీరంగంలో తనకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి, విజయం సాధించడానికి అమ్మ, బలరామయ్య పాత్ర కీలకమని అక్కినేని చెప్పారు. తాను కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్కు తరలివెళ్లినా, సినీ కెరీర్ ప్రారంభించిన మద్రాస్ (చెన్నయ్) నగరానికి తన మనసులో ప్రత్యేక స్థానముందన్నారు. ఒకప్పుడు దక్షిణాది భాషా చిత్రాలన్నీ ఇక్కడే నిర్మించేవారని చెప్పారు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించానని, ఒకనొకప్పుడు కాఫీ కోసం వీధుల్లో నడిచి వెళ్లానని నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.
భారత పరిశ్రమ వందేళ్ల వేడుకలను జరుపుకొంటున్నా ప్రపంచ సినీ రంగంలో ఇంకా తగినంత గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డారు. సంఖ్యా పరంగా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న భారత పరిశ్రమకు ఇది నష్టదాయకమని చెప్పారు. నాణ్యత లేకపోవడమే దీనికి కారణమన్నారు. సాంకేతికంగా, సృజనాత్మకంగా అభివృద్ధి చెందితే గ్లోబల్ మార్కెట్లో ప్రముఖ స్థానం సంపాదించవచ్చునని నాగేశ్వరరావు సూచించారు. తన సినీవారసుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలసి 'మనం' అనే సినిమాలో నటిస్తున్నారు.