లేడీ గెటప్లో తాతా-మనవళ్లు
హైదరాబాద్ : తాతా తొలి రోజుల్లోనే స్త్రీ పాత్రలు పోషించి అలరిస్తే.... ఆయన మనవడు కూడా అదే బాటలో నడిచాడు. వాళ్లిద్దరే అక్కినేని నాగేశ్వరరావు, సుమంత్. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు తొలి దశలో మహిళ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొదట్లో ఆయన ఎక్కువ మహిళ పాత్రల్లోనే కనిపించేవారు. ఆయన గొంతు కూడా అందు చక్కగా అతికినట్టు సరిపోయేది. తెలుగు సినీ పరిశ్రమకు తొలి రొమాంటిక్ హీరోగా రికార్డు సృష్టించిన ఘనత ఎఎన్‌ఆర్‌ది. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు.
అక్కినేని ఆరేళ్ల వయసులోనే కళామతల్లి సేవకు సిద్ధమయ్యారు. అక్కినేని విద్యాభ్యాసం ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అప్పట్లో దాన్ని ఒక కొరతగా ఆయన భావించలేదు. పాఠశాల విద్యకు బదులు నటనకు బాటలు వేసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడయ్యారు. ఈ పయనంలో ఆయన తల్లి ప్రోత్సాహం మరువలేనిది. అక్కినేని మొదట ప్రాచుర్యం పొందింది స్త్రీ పాత్రల ద్వారానే. ఆ రోజుల్లో స్త్రీలు నటించడానికి ముందుకొచ్చేవారు కాదు. అందువలన వారి పాత్రలనూ పురుషులే పోషించేవారు. అలా అక్కినేని స్త్రీ పాత్రల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే అక్కినేని స్త్రీ పాత్ర వేస్తే సింగారమే అనేవారు.
కాగా తాతను స్పూర్తిగా తీసుకున్న ఆయన మనవడు సుమంత్ కూడా లేడీ గెటప్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని తాజా చిత్రం ‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు’లో స్త్రీ పాత్రలో అలరిస్తున్నాడు. మరి లేడీ గెటప్లో సుమంత్...తాతలా ఏమేరకు అలరిస్తాడో చూడాలి.