Emo Gurram Egaravacchu
-
తాతయ్యను అలా చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి!
అక్కినేనికి ముద్దుల మనవడు సుమంత్. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగారు. ‘‘నాకు అమ్మా నాన్నా ఇద్దరూ తాతయ్యలోనే కనిపిస్తారు’’ అని అంటుంటారు సుమంత్. మంగళవారం మధ్యాహ్నం... ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ప్రమోషన్‌లోభాగంగా సుమంత్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా తాతయ్య గురించి ఎన్నో ముచ్చట్లను ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఏ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాను తాతయ్య చూశారు. హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఆయన అలా నవ్వుతుంటే.. నాకు కలిగిన ఆనందాన్ని మాటలతో చెప్పలేను. ఎప్పుడూ ఆయన అలాగే నవ్వుతూ ఉండాలనుకున్నాను. ఏ ఈ సినిమాలో నేను లేడీ గెటప్ వేసిన సంగతి తెలుసు కదా. అలా నటించడం కష్టమైనా... ఇష్టంతో చేశా. తాతయ్యలోని వయ్యారమంతా నాలో కనిపించిందని చాలామంది అన్నారు. ఆయన మనవణ్ణి కదా! తాతయ్య ఆ గెటప్ చూసి నన్ను అభినందించారు. ఏ తాతయ్యకు ఇప్పుడు సినిమాలు చూడడమే వ్యాపకం. కొత్త, పాత తేడా లేకుండా అన్ని సినిమాలూ తెప్పించుకొని మరీ చూస్తున్నారు. మనం కూడా చూడనన్ని సినిమాలు చూసేస్తున్నారు. సినిమాను ఆయన ఎంత ప్రేమిస్తారో... ఎంత పూజిస్తారో... ఎంత ఆరాధిస్తారో నాకిప్పుడు అర్థమవుతోంది. తాతయ్య ఆశ, శ్వాస సినిమానే! ఏ నేను తాతయ్య దగ్గరే పెరిగాను. చిన్నప్పుడు ఆయనతో పాటు షూటింగులకు వెళ్లేవాణ్ణి. తాతయ్య నటనను శ్రద్ధగా గమనిస్తుండేవాణ్ణి. ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ చూసి.. ఇంటికొచ్చి ఓ గ్లాస్ పట్టుకొని ‘వందనం అభివందనం’ అని యాక్ట్ చేయడ ం నాకు ఇంకా గుర్తే.. తాతయ్య కూడా నన్ను చూసి భలే మురిసిపోయేవారు. కొన్ని సినిమాల క్లైమాక్సుల్లో తాతయ్య చనిపోవడం చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి. నిజంగా అలాగే జరిగిందేమో... అని కుమిలిపోయేవాణ్ణి. తాతయ్య ఒళ్లో కూర్చోబెట్టుకొని ‘అవన్నీ నిజం కాదు నాన్నా... కేవలం యాక్టింగే’ అని బుజ్జగించేవారు. ఏ తాతయ్య నాతో చాలా విషయాలను షేర్ చేసుకుంటారు. వృత్తిపరంగా ఎన్నో సలహాలిస్తుంటారు. అంతేతప్ప తన అభిప్రాయాలను మాత్రం రుద్దరు. తాతయ్య తరచూ చెప్పే మాటొక్కటే. ‘ట్రెండ్‌ని గమనిస్తూ ఉండు. దాన్ని బట్టే మనం నడవాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. జీవితం అనేది పాత చింతకాయ పచ్చడిలా ఉండకూడదు’ అని. తాతయ్య అలాగే బతికారు. తాత, మనవడు అనే బంధాలను కాసేపు పక్కన పెడితే... ఆయన పెద్ద స్టార్, నేను ఆయన అభిమానిని. ఏ తాతయ్య గురించి నేను ఎంతైనా మాట్లాడగలను. కానీ... నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. 256 చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తాతయ్య. స్వతహాగా మహానటుడు కావడంతో అన్నీ అవలీలగానే నటించేశారనుకుంటున్నా. అయితే.. ‘బాటసారి’ విషయంలో మాత్రం కష్టపడ్డట్టు చెబుతారు. నేనూ ఆ సినిమా చూశాను. వెరీ టఫ్ క్యారెక్టర్. సాధారణమైన నటులు ఆ పాత్రను చేయలేరు. ఏ తాతయ్య సూపర్‌స్టార్. ఇది అందరికీ తెలిసిందే. అయితే... అంతటి స్టార్ స్టేటస్‌ని కూడా ఆయన కేర్ చేయరు. తాతయ్యకు కేరక్టర్ ముఖ్యం. అందుకే... ఎన్టీ రామారావుగారు హీరోగా చేసిన ‘మిస్సమ్మ’లో కమెడియన్‌గా నటించారు. ఆయన చేయడం వల్ల కమెడియన్ పాత్ర కూడా హీరో పాత్ర అయిపోయింది. ఏ తాతయ్య చిత్రాల్లో నాకు ఇష్టమైన చిత్రం ‘దేవదాసు’. ఆ పాత్రను ఆ స్థాయిలో చేయదగ్గ నటుడు ఇండియన్ సినీ హిస్టరీలోనే లేడు... రాడు కూడా. ‘దేవదాసు’ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్చి, రీమేక్ చేయాలని ఉంది. పైగా అందులో ‘దేవదాసు’గా నేనే నటించాలని ఉంది. అది నిజంగా సాహసమే. కానీ చేస్తా. నిజానికి బాలీవుడ్లో ఇప్పటికే మోడ్రన్ దేవదాసు వచ్చేసింది. కానీ ఎక్కడో రావడం ముఖ్యం కాదు. ఇక్కడ రావడం ముఖ్యం. ఎందుకంటే... దేవదాసు మనకు దగ్గరైనట్లు ఎవరికీ దగ్గర కాలేదు. ఇండియా మొత్తం మీద ఎంతమంది ‘దేవదాసు’లున్నా... మన దేవదాసే గ్రేట్. అందుకే... ఇక్కడ ముఖ్యంగా మోడ్రన్ దేవదాసు రావాలి. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తాను. -
లేడీ గెటప్‌లో తాతా-మనవళ్లు
హైదరాబాద్ : తాతా తొలి రోజుల్లోనే స్త్రీ పాత్రలు పోషించి అలరిస్తే.... ఆయన మనవడు కూడా అదే బాటలో నడిచాడు. వాళ్లిద్దరే అక్కినేని నాగేశ్వరరావు, సుమంత్. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు తొలి దశలో మహిళ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొదట్లో ఆయన ఎక్కువ మహిళ పాత్రల్లోనే కనిపించేవారు. ఆయన గొంతు కూడా అందు చక్కగా అతికినట్టు సరిపోయేది. తెలుగు సినీ పరిశ్రమకు తొలి రొమాంటిక్ హీరోగా రికార్డు సృష్టించిన ఘనత ఎఎన్ఆర్ది. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు. అక్కినేని ఆరేళ్ల వయసులోనే కళామతల్లి సేవకు సిద్ధమయ్యారు. అక్కినేని విద్యాభ్యాసం ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అప్పట్లో దాన్ని ఒక కొరతగా ఆయన భావించలేదు. పాఠశాల విద్యకు బదులు నటనకు బాటలు వేసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడయ్యారు. ఈ పయనంలో ఆయన తల్లి ప్రోత్సాహం మరువలేనిది. అక్కినేని మొదట ప్రాచుర్యం పొందింది స్త్రీ పాత్రల ద్వారానే. ఆ రోజుల్లో స్త్రీలు నటించడానికి ముందుకొచ్చేవారు కాదు. అందువలన వారి పాత్రలనూ పురుషులే పోషించేవారు. అలా అక్కినేని స్త్రీ పాత్రల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే అక్కినేని స్త్రీ పాత్ర వేస్తే సింగారమే అనేవారు. కాగా తాతను స్పూర్తిగా తీసుకున్న ఆయన మనవడు సుమంత్ కూడా లేడీ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని తాజా చిత్రం ‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు’లో స్త్రీ పాత్రలో అలరిస్తున్నాడు. మరి లేడీ గెటప్‌లో సుమంత్...తాతలా ఏమేరకు అలరిస్తాడో చూడాలి. -
‘సత్యం’ తర్వాత నాకోసం తను విన్న కథ ఇదే!
దాదాపు 15 ఏళ్ల కెరీర్. అప్పుడప్పుడూ విజయాలు... అడుగడుగునా ఆటుపోట్లు. కానీ, సుమంత్ మోములో చిరునవ్వు చెదరదు. మనోనిబ్బరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తాత పోలికల్నే కాదు, తాతలోని ఆత్మస్థైర్యాన్ని కూడా పుణికిపుచ్చుకున్న వ్యక్తి తను. సుమంత్ కొత్తగా ప్రయత్నించిన ప్రతి సినిమా హిట్టే. సత్యం, గౌరి, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్.. సినిమాలే అందుకు నిదర్శనాలు. చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో! గుర్రం ఎగరావచ్చు’ ఈ నెల 24న విడుదల కానుంది. తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో మరోసారి చూస్తారని నమ్మకంగా చెబుతున్న సుమంత్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’.. అసలు గుర్రం ఎగరడం ఏంటి? కొత్తదనం కోసం ఇలా పెట్టారా? మొదట్లో నేనూ అలాగే అనుకున్నా. కానీ కథ విన్నాక మాత్రం ఇదే కరెక్ట్ అనిపించింది. ఓ పల్లెటూరి బైతు.. అమెరికా వెళ్లి అనుకున్నది సాధించడం కథ. ఆ పాత్రను ఉద్దేశించి పెట్టిన టైటిల్ ఇది. పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందీ సినిమా. చివర్లో చిన్న పెయిన్ కూడా ఉంటుంది. నాకు చాలా నచ్చిన కథ ఇది. అంటే... ఇందులో మీరు పల్లెటూరి బైతా? అవును. పేరు బుల్లెబ్బాయి. ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోడు. సరదా టైపు. ఎక్కువగా మాట్లాడటం అతని దినచర్య. మంచివాడు, ముక్కుసూటిగా ఉంటాడు. నిజంగా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎస్.ఎస్. కాంచీ మీకోసమే ఈ కథ తయారు చేశారా? ఫలానావారి కోసం అన్నట్టుగా కాంచీ ఈ కథ రాసుకోలేదు. ఓ థాట్ వచ్చింది. అల్లేశారు అంతే. ఈ కథ వినగానే... బుల్లెబ్బాయి పాత్ర కు రవితేజగానీ, సునీల్ గానీ కరెక్ట్ అనిపించింది. వారు చేయదగ్గ ఎనర్జీ ఉన్న పాత్ర ఇది. అదృష్టం కొద్దీ నా వద్దకొచ్చింది. అందుకే సవాల్‌గా తీసుకొని చేశా. ఇందులో నన్ను చూసిన ఎవరైనా ‘సుమంతేనా?’ అని ఆశ్చర్యపోతారు. కథ ఫస్ట్ మీరే విన్నారా? ‘రాజన్న’ షూటింగ్ టైమ్‌లోనే నా సోదరి సుప్రియ ఈ కథ విని చాలా బావుందని చెప్పింది. ఆ తర్వాత.. ఈ కథ ఆ చేతులూ ఈ చేతులూ మారి, చివరకు చంద్రసిద్దార్థ్ చేతికొచ్చింది. ఆయన ద్వారా మళ్లీ నా దగ్గరకొచ్చింది. మరో విషయం ఏంటంటే... ‘సత్యం’ కథ ముందు విన్నది సుప్రియే. ఆ తర్వాత మళ్లీ ఈ కథ విన్నది. అందుకే.. ఇది నాకో సెంటిమెంట్. బ్యాంకాక్‌లో సినిమా ఎక్కువ తీసినట్టున్నారు? కథకు అవసరం. అందుకే చేశాం. పైగా మా హీరోయిన్ పింకీ సావిక థాయ్‌ల్యాండ్‌లో పెద్ద సూపర్‌స్టార్. అందుకే ఈ సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నాం. ఇంకా ఇందులో ప్రత్యేకతలు? కీరవాణి సంగీతం. ఈ కథను ప్రేమించి చేశారాయన. చిత్రీకరణ విషయంలో సలహాలు కూడా ఇచ్చారు. పైగా ఈ సినిమా టైటిల్ ఆయన పాట నుంచి పుట్టిందే. బాపుగారి ‘రాంబంటు’లో కీరవాణి స్వరపరిచిన పాట పల్లవే ఈ సినిమా టైటిల్. ఆయన సంగీతం ఈ చిత్రానికి స్పెషల్. ఆ తర్వాతే ఏదైనా... ఇన్నాళ్ల కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కదా. మరి ఈ విషయంలో కుటుంబం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? ఇక్కడ ఎవరి కష్టాలు వారివండీ. అందుకే ఒకరి సపోర్ట్ కోసం ఎదురు చూడను. పైగా ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోను కూడా. విజయాలకు పొంగిపోను. ఆపజయాలు కృంగిపోను. నా తరహా ఇది. నేను, నా సినిమాలు, నా తాతయ్య... ప్రస్తుతం నా జీవితం ఇదే. సూపర్‌హిట్ కథలెన్నో.. మీ వద్దకొచ్చి రిజక్టై వేరేవారికెళ్లాయంటారు? పచ్చి అబద్ధం. నా వద్దకొచ్చాక కూడా నేను ‘మిస్’ చేసుకున్న ఒకే ఒక కథ ‘నువ్వే కావాలి’. ఆ టైమ్‌లో నేను ‘యువకుడు’ చేస్తున్నా. ఆ సినిమాలో బిజీగా ఉండటం వల్ల ‘నువ్వేకావాలి’ని వదులుకోవాల్సొచ్చింది. పూరీజగన్నాథ్ కూడా ఓ కథ చెప్పాడు. అప్పట్లో తను స్టార్ డెరైక్టర్ కాదు. ఆ కథ తర్వాత సినిమాగా వచ్చిన దాఖలాలూ లేవు. కథ మంచిదైతే... నాకు కచ్చితంగా నచ్చుతుంది. సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది, మీ హిట్ మూవీ ‘సత్యం’కి సీక్వెల్ చేయొచ్చుగా? తెలుగులో ఆ ట్రెండ్ రాలేదు. ‘ఆర్య’కి సీక్వెల్ ‘ఆర్య-2’ అంటారు కానీ... నిజానికి ఆ సినిమాకూ, ఈ సినిమాకూ పోలిక లేదు. నా సినిమాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే... ‘సత్యం’ కరెక్ట్ కాదు. ‘గోదావరి’ కరెక్ట్. పెళ్లి అయిన తర్వాత వార్దిదరి జీవితంపై ఓ కథ తయారు చేస్తే బావుంటుందని కొందరు చెప్పారు. కాకపోతే... ఆ ఆలోచన శేఖర్ కమ్ములకు కూడా రావాలి కదా. మిగిలిన హీరోల్లా ఫోర్స్‌గా సినిమాలు చేయరెందుకు? నాకు నటించడం ఒక్కటే తెలుసు. ఇక్కడ అదొక్కటుంటే సరిపోదు. ఛాన్సులు దక్కించుకునే టెక్నిక్కులు తెలిసుండాలి. ఆ విషయంలో నేను పూర్. ఆ మధ్య ఏదో చేయాలని రెండుమూడు సినిమాలు చేశాను. ఇక నుంచి చెత్తకథలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నా. నచ్చిన కథ మాత్రమే చేస్తాను. నచ్చకపోతే.. సినిమాలు చేయను. త్వరలో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్‌కి అనుబంధ సంస్థగా ఆ సంస్థ ఉంటుంది. ఇందులో భాగంగానే రెండు కథలు విన్నాను కూడా. వాటి వివరాలు త్వరలో చెబుతా. ఇంతకూ తాతగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఒక్కోసారి బాగుంటున్నారు. ఒక్కోసారి ఇబ్బంది పడుతున్నారు. ఆయన డిసీజ్ అలాంటిది. త్వరలోనే తేరుకుంటారనుకుంటున్నా. ఆయన ఆత్మస్థైర్యం తెలిసిందేగా.