తాతయ్యను అలా చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి!
తాతయ్యను అలా చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి!
Published Thu, Jan 23 2014 4:15 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM
అక్కినేనికి ముద్దుల మనవడు సుమంత్. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగారు. ‘‘నాకు అమ్మా నాన్నా ఇద్దరూ తాతయ్యలోనే కనిపిస్తారు’’ అని అంటుంటారు సుమంత్. మంగళవారం మధ్యాహ్నం... ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ప్రమోషన్‌లోభాగంగా సుమంత్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా తాతయ్య గురించి ఎన్నో ముచ్చట్లను ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఏ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాను తాతయ్య చూశారు. హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఆయన అలా నవ్వుతుంటే.. నాకు కలిగిన ఆనందాన్ని మాటలతో చెప్పలేను. ఎప్పుడూ ఆయన అలాగే నవ్వుతూ ఉండాలనుకున్నాను. ఏ ఈ సినిమాలో నేను లేడీ గెటప్ వేసిన సంగతి తెలుసు కదా.
అలా నటించడం కష్టమైనా... ఇష్టంతో చేశా. తాతయ్యలోని వయ్యారమంతా నాలో కనిపించిందని చాలామంది అన్నారు. ఆయన మనవణ్ణి కదా! తాతయ్య ఆ గెటప్ చూసి నన్ను అభినందించారు. ఏ తాతయ్యకు ఇప్పుడు సినిమాలు చూడడమే వ్యాపకం. కొత్త, పాత తేడా లేకుండా అన్ని సినిమాలూ తెప్పించుకొని మరీ చూస్తున్నారు. మనం కూడా చూడనన్ని సినిమాలు చూసేస్తున్నారు. సినిమాను ఆయన ఎంత ప్రేమిస్తారో... ఎంత పూజిస్తారో... ఎంత ఆరాధిస్తారో నాకిప్పుడు అర్థమవుతోంది. తాతయ్య ఆశ,
శ్వాస సినిమానే!
ఏ నేను తాతయ్య దగ్గరే పెరిగాను. చిన్నప్పుడు ఆయనతో పాటు షూటింగులకు వెళ్లేవాణ్ణి. తాతయ్య నటనను శ్రద్ధగా గమనిస్తుండేవాణ్ణి. ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ చూసి.. ఇంటికొచ్చి ఓ గ్లాస్ పట్టుకొని ‘వందనం అభివందనం’ అని యాక్ట్ చేయడ ం నాకు ఇంకా గుర్తే.. తాతయ్య కూడా నన్ను చూసి భలే మురిసిపోయేవారు. కొన్ని సినిమాల క్లైమాక్సుల్లో తాతయ్య చనిపోవడం చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి. నిజంగా అలాగే జరిగిందేమో... అని కుమిలిపోయేవాణ్ణి. తాతయ్య ఒళ్లో కూర్చోబెట్టుకొని ‘అవన్నీ నిజం కాదు నాన్నా... కేవలం యాక్టింగే’ అని బుజ్జగించేవారు. ఏ తాతయ్య నాతో చాలా విషయాలను షేర్ చేసుకుంటారు. వృత్తిపరంగా ఎన్నో సలహాలిస్తుంటారు. అంతేతప్ప తన అభిప్రాయాలను మాత్రం రుద్దరు. తాతయ్య తరచూ చెప్పే మాటొక్కటే. ‘ట్రెండ్‌ని గమనిస్తూ ఉండు. దాన్ని బట్టే మనం నడవాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. జీవితం అనేది పాత చింతకాయ పచ్చడిలా ఉండకూడదు’ అని. తాతయ్య అలాగే బతికారు. తాత, మనవడు అనే బంధాలను కాసేపు పక్కన
పెడితే... ఆయన పెద్ద స్టార్, నేను ఆయన అభిమానిని.
ఏ తాతయ్య గురించి నేను ఎంతైనా మాట్లాడగలను. కానీ... నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. 256 చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తాతయ్య. స్వతహాగా మహానటుడు కావడంతో అన్నీ అవలీలగానే నటించేశారనుకుంటున్నా. అయితే.. ‘బాటసారి’ విషయంలో మాత్రం కష్టపడ్డట్టు చెబుతారు. నేనూ ఆ సినిమా చూశాను. వెరీ టఫ్ క్యారెక్టర్. సాధారణమైన నటులు ఆ పాత్రను చేయలేరు.
ఏ తాతయ్య సూపర్‌స్టార్. ఇది అందరికీ తెలిసిందే. అయితే... అంతటి స్టార్ స్టేటస్‌ని కూడా ఆయన కేర్ చేయరు. తాతయ్యకు కేరక్టర్ ముఖ్యం. అందుకే... ఎన్టీ రామారావుగారు హీరోగా చేసిన ‘మిస్సమ్మ’లో కమెడియన్‌గా నటించారు. ఆయన చేయడం వల్ల కమెడియన్ పాత్ర కూడా హీరో పాత్ర అయిపోయింది. ఏ తాతయ్య చిత్రాల్లో నాకు ఇష్టమైన చిత్రం ‘దేవదాసు’. ఆ పాత్రను ఆ స్థాయిలో చేయదగ్గ నటుడు ఇండియన్ సినీ హిస్టరీలోనే లేడు... రాడు కూడా. ‘దేవదాసు’ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్చి, రీమేక్ చేయాలని ఉంది. పైగా అందులో ‘దేవదాసు’గా నేనే నటించాలని ఉంది. అది నిజంగా సాహసమే. కానీ చేస్తా. నిజానికి బాలీవుడ్‌లో ఇప్పటికే మోడ్రన్ దేవదాసు వచ్చేసింది. కానీ ఎక్కడో రావడం ముఖ్యం కాదు. ఇక్కడ రావడం ముఖ్యం. ఎందుకంటే... దేవదాసు మనకు దగ్గరైనట్లు ఎవరికీ దగ్గర కాలేదు. ఇండియా మొత్తం మీద ఎంతమంది ‘దేవదాసు’లున్నా... మన దేవదాసే గ్రేట్. అందుకే... ఇక్కడ ముఖ్యంగా మోడ్రన్ దేవదాసు రావాలి. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తాను.
Advertisement
Advertisement