‘సత్యం’ తర్వాత నాకోసం తను విన్న కథ ఇదే! | Sumanth Special Interview | Sakshi
Sakshi News home page

‘సత్యం’ తర్వాత నాకోసం తను విన్న కథ ఇదే!

Published Wed, Jan 22 2014 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

‘సత్యం’ తర్వాత నాకోసం తను విన్న కథ ఇదే! - Sakshi

‘సత్యం’ తర్వాత నాకోసం తను విన్న కథ ఇదే!

దాదాపు 15 ఏళ్ల కెరీర్. అప్పుడప్పుడూ విజయాలు... అడుగడుగునా ఆటుపోట్లు. కానీ, సుమంత్ మోములో చిరునవ్వు చెదరదు. మనోనిబ్బరం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తాత పోలికల్నే కాదు, తాతలోని ఆత్మస్థైర్యాన్ని కూడా పుణికిపుచ్చుకున్న వ్యక్తి తను. సుమంత్ కొత్తగా ప్రయత్నించిన ప్రతి సినిమా హిట్టే. సత్యం, గౌరి, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్.. సినిమాలే అందుకు నిదర్శనాలు. చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో! గుర్రం ఎగరావచ్చు’ ఈ నెల 24న విడుదల కానుంది. తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో మరోసారి చూస్తారని నమ్మకంగా చెబుతున్న సుమంత్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. 
 
 ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’.. అసలు గుర్రం ఎగరడం ఏంటి? కొత్తదనం కోసం ఇలా పెట్టారా?
 మొదట్లో నేనూ అలాగే అనుకున్నా. కానీ కథ విన్నాక మాత్రం ఇదే కరెక్ట్ అనిపించింది. ఓ పల్లెటూరి బైతు.. అమెరికా వెళ్లి అనుకున్నది సాధించడం కథ. ఆ పాత్రను ఉద్దేశించి పెట్టిన టైటిల్ ఇది. పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందీ సినిమా. చివర్లో చిన్న పెయిన్ కూడా ఉంటుంది. నాకు చాలా నచ్చిన కథ ఇది.
 
 అంటే... ఇందులో మీరు పల్లెటూరి బైతా?
 అవును. పేరు బుల్లెబ్బాయి. ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోడు. సరదా టైపు. ఎక్కువగా మాట్లాడటం అతని దినచర్య. మంచివాడు, ముక్కుసూటిగా ఉంటాడు. నిజంగా ఛాలెంజింగ్ క్యారెక్టర్. 
 
 ఎస్.ఎస్. కాంచీ మీకోసమే ఈ కథ తయారు చేశారా?
 ఫలానావారి కోసం అన్నట్టుగా కాంచీ ఈ కథ రాసుకోలేదు. ఓ థాట్ వచ్చింది. అల్లేశారు అంతే. ఈ కథ వినగానే... బుల్లెబ్బాయి పాత్ర కు రవితేజగానీ, సునీల్ గానీ కరెక్ట్ అనిపించింది. వారు చేయదగ్గ ఎనర్జీ ఉన్న పాత్ర ఇది. అదృష్టం కొద్దీ నా వద్దకొచ్చింది. అందుకే సవాల్‌గా తీసుకొని చేశా. ఇందులో నన్ను చూసిన ఎవరైనా ‘సుమంతేనా?’ అని ఆశ్చర్యపోతారు. 
 
 కథ ఫస్ట్ మీరే విన్నారా?
 ‘రాజన్న’ షూటింగ్ టైమ్‌లోనే నా సోదరి సుప్రియ ఈ కథ విని చాలా బావుందని చెప్పింది. ఆ తర్వాత.. ఈ కథ ఆ చేతులూ ఈ చేతులూ మారి, చివరకు చంద్రసిద్దార్థ్ చేతికొచ్చింది. ఆయన ద్వారా మళ్లీ నా దగ్గరకొచ్చింది. మరో విషయం ఏంటంటే... ‘సత్యం’ కథ ముందు విన్నది సుప్రియే. ఆ తర్వాత మళ్లీ ఈ కథ విన్నది. అందుకే.. ఇది నాకో సెంటిమెంట్. 
 
 బ్యాంకాక్‌లో సినిమా ఎక్కువ తీసినట్టున్నారు?
 కథకు అవసరం. అందుకే చేశాం. పైగా మా హీరోయిన్ పింకీ సావిక థాయ్‌ల్యాండ్‌లో పెద్ద సూపర్‌స్టార్. అందుకే ఈ సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నాం.
 
 ఇంకా ఇందులో ప్రత్యేకతలు?
 కీరవాణి సంగీతం. ఈ కథను ప్రేమించి చేశారాయన. చిత్రీకరణ విషయంలో సలహాలు కూడా ఇచ్చారు. పైగా ఈ సినిమా టైటిల్ ఆయన పాట నుంచి పుట్టిందే. బాపుగారి ‘రాంబంటు’లో కీరవాణి స్వరపరిచిన పాట పల్లవే ఈ సినిమా టైటిల్. ఆయన సంగీతం ఈ చిత్రానికి స్పెషల్. ఆ తర్వాతే ఏదైనా...
 
 ఇన్నాళ్ల కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కదా. మరి ఈ విషయంలో కుటుంబం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది?
 ఇక్కడ ఎవరి కష్టాలు వారివండీ. అందుకే ఒకరి సపోర్ట్ కోసం ఎదురు చూడను. పైగా ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోను కూడా. విజయాలకు పొంగిపోను. ఆపజయాలు కృంగిపోను. నా తరహా ఇది. నేను, నా సినిమాలు, నా తాతయ్య... ప్రస్తుతం నా జీవితం ఇదే. 
 
 సూపర్‌హిట్ కథలెన్నో.. మీ వద్దకొచ్చి రిజక్టై వేరేవారికెళ్లాయంటారు?
 పచ్చి అబద్ధం. నా వద్దకొచ్చాక కూడా నేను ‘మిస్’ చేసుకున్న ఒకే ఒక కథ ‘నువ్వే కావాలి’. ఆ టైమ్‌లో నేను ‘యువకుడు’ చేస్తున్నా. ఆ సినిమాలో బిజీగా ఉండటం వల్ల ‘నువ్వేకావాలి’ని వదులుకోవాల్సొచ్చింది. పూరీజగన్నాథ్ కూడా ఓ కథ చెప్పాడు. అప్పట్లో తను స్టార్ డెరైక్టర్ కాదు. ఆ కథ తర్వాత సినిమాగా వచ్చిన దాఖలాలూ లేవు. కథ మంచిదైతే... నాకు కచ్చితంగా నచ్చుతుంది. 
 
 సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది, మీ హిట్ మూవీ ‘సత్యం’కి సీక్వెల్ చేయొచ్చుగా?
 తెలుగులో ఆ ట్రెండ్ రాలేదు. ‘ఆర్య’కి సీక్వెల్ ‘ఆర్య-2’ అంటారు కానీ... నిజానికి ఆ సినిమాకూ, ఈ సినిమాకూ పోలిక లేదు. నా సినిమాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే... ‘సత్యం’ కరెక్ట్ కాదు. ‘గోదావరి’ కరెక్ట్. పెళ్లి అయిన తర్వాత వార్దిదరి జీవితంపై ఓ కథ తయారు చేస్తే బావుంటుందని కొందరు చెప్పారు. కాకపోతే... ఆ ఆలోచన శేఖర్ కమ్ములకు కూడా రావాలి కదా. 
 
 మిగిలిన హీరోల్లా ఫోర్స్‌గా సినిమాలు చేయరెందుకు?
 నాకు నటించడం ఒక్కటే తెలుసు. ఇక్కడ అదొక్కటుంటే సరిపోదు. ఛాన్సులు దక్కించుకునే టెక్నిక్కులు తెలిసుండాలి. ఆ విషయంలో నేను పూర్. ఆ మధ్య ఏదో చేయాలని రెండుమూడు సినిమాలు చేశాను. ఇక నుంచి చెత్తకథలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నా. నచ్చిన కథ మాత్రమే చేస్తాను. నచ్చకపోతే.. సినిమాలు చేయను. త్వరలో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నా, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్‌కి అనుబంధ సంస్థగా ఆ సంస్థ ఉంటుంది. ఇందులో భాగంగానే రెండు కథలు విన్నాను కూడా. వాటి వివరాలు త్వరలో చెబుతా.
 
 ఇంతకూ తాతగారి ఆరోగ్యం ఎలా ఉంది?
 ఒక్కోసారి బాగుంటున్నారు. ఒక్కోసారి ఇబ్బంది పడుతున్నారు. ఆయన డిసీజ్ అలాంటిది. త్వరలోనే తేరుకుంటారనుకుంటున్నా. ఆయన ఆత్మస్థైర్యం తెలిసిందేగా.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement