అక్షయ్ @ టాయ్‌లెట్ భారత్!
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే... కడుపు నిండడం కోసం ఏ పనైనా చేయొచ్చని ఓ అర్థం. సినిమా స్టార్స్ ఈ సామెతను తమకు అనుకూలంగా మలుచుకుని పబ్లిసిటీ కోసం కోటి విద్యలు అంటున్నారు. ఇదిగో... హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ను చూడండి! శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లో ఓ టాయ్‌లెట్ నిర్మాణానికి పార, పలుగు పట్టుకున్నారు. స్వతహాగా అక్షయ్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తుంటారు. కానీ, ఈ టాయ్‌లెట్ నిర్మాణానికి సహకరించడం మాత్రం పబ్లిసిటీ స్టంట్.
‘టాయ్‌లెట్ – ఏక్ ప్రేమ్ కథ’ పేరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో ఓ జంట మధ్య టాయ్‌లెట్ ఎలాంటి పాత్ర పోషించిందనే కథతో రూపొందిన ఈ సినిమా పబ్లిసిటీ కోసమే అక్షయ్ ఈ టాయ్‌లెట్ భారత్ పనుల్లో పాల్గొన్నారని ముంబయ్ జనాలు అంటున్నారు. మున్ముందు దీన్నో ఉద్యమంలా మలచినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఆగస్టు 11న ‘టాయ్‌లెట్ – ఏక్ ప్రేమ్ కథ’ను విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే... ఐదు నెలల ముందే అక్షయ్ పబ్లిసిటీ ప్రారంభించారన్నమాట.