‘నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. అందుకే ఎప్పటికీ రాజకీయాల్లోకి అడుగు పెట్టను’ అంటున్నాడు బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్. న్యూఢిల్లీలోని ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్‌ని విలేకరులు రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. ‘నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక.. నాకు నటన అంటే ఇష్టం. నా చిత్రాలతో దేశానికి సహకరించాలనుకుంటున్నాను. అదే నా ఉద్యోగం కూడా’ అని అక్కీ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా జాతీయ ఆవార్డు ఫంక‌్షన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి అక్షయ్ చెబుతూ... ‘ నా మొదటి జాతీయ ఆవార్డు కార్యక్రమంలో ఓ అమ్మాయి నాతో మాట్లాడుతూ.. తను నాకు వీరాభిమాని అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి నా పక్క సీటులోనే కుర్చుని ఉంది. అవార్డు గెలుచుకున్నందుకు అభినందలు కూడా చెప్పింది. అలాగే మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అడగ్గా దానికి నేను 137 అని సమాధానం ఇచ్చాను. అదే ప్రశ్న తనని అడిగాను.. అది తన మొదటి చిత్రం అని చెప్పింది.(తను కూడా జాతీయ ఆవార్డును గెలుచుకుంది) ఇక మీరే ఊహించుకోండి నాకు ఎంతటి అవమానం ఎదురై ఉంటుందో’ అని చమత్కరించాడు.
కాగా 2016లో అక్షయ్ నటించిన థ్రిల్లర్ చిత్రం ‘రుస్తుం’కు 2017లో జాతీయ ఆవార్డును గెలుచుకున్నాడు. తాజాగా అక్షయ్ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌తో కలిసి ‘గుడ్‌న్యూస్’లో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నఈ చిత్రం విడుదలకు సిద్ధమైనట్లు సినిమా యూనిట్ పేర్కొంది. కాగా అక్షయ్ కుమార్ గత రెండు సంవత్సరాల నుంచి వివిధ సామాజిక కార్యాక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment