కాళకేయుడితో తలపడుతున్న కాట్రవల్లి
స్టార్ కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ అలీ ప్రేక్షకులను అలరించారు. ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’, ‘గుండమ్మగారి మనవడు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా మెప్పించారాయన. ఇక.. ప్రభాకర్ విషయానికి వస్తే... విలన్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ‘రైట్ రైట్’ మూవీలో హీరోకు సమానంగా ఉండే ఫుల్ లెంగ్త్ పాత్రలో మెప్పించారు. కాట్రవల్లి డైలాగ్‌తో అలీ వినోదం పండిస్తే.. కాళకేయగా ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాకర్ ప్రేక్షకులను భయపెట్టారు.
తాజాగా వీరిద్దరూ లీడ్ రోల్‌లో ‘కాళకేయ వర్సెస్ కాట్రవల్లి’ చిత్రం రూపొందుతోంది. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఓగిరాల మూవీస్ పతాకంపై వేమూరి నాగేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇది కామెడీ ఎంటర్‌టైనర్. ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించిన దేవుడి పాత్ర తరహాలో ఈ చిత్రంలో ఓ ప్రముఖ నటుడు కనిపిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: మురళీమోహన్ రెడ్డి.