
కంగ్రాట్స్ కాదు... థ్యాంక్స్ అంటున్నారు
‘‘సినీ పరిశ్రమ సక్సెస్ వెనక పరుగులు తీస్తుందన్న విషయం నిజమే. కానీ, కిశోర్ తీసిన ‘సెకండ్ హ్యాండ్’ సినిమా సరిగ్గా లేకపోయినా, ‘స్రవంతి’ రవికిశోర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా కంటెంట్‌ను నమ్ముకుంటే ఏ సినిమా అయినా బాగా ఆడుతుందన్న నమ్మకం కలిగించారు’’ అని ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. రామ్, కీర్తీ సురేశ్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికి శోర్ నిర్మించిన ‘నేను...శైలజ’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలోని సెన్సిటివ్ పాయింట్‌ను కమర్షియల్‌గా ఎలా డీల్ చేయగలమా? అని తొలుత సందేహించాం.
కానీ కిశోర్ అందరికీ నచ్చేలా తీశాడు. ఇదేదో సూపర్ హిట్ అని మేం గొప్పలు చెప్పట్లేదు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే సంతోషం వ్యక్తం చేయడానికే ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారు. రామ్ మాట్లాడుతూ- ‘‘ ‘దేవదాసు’ని మినహాయిస్తే నేను చేసినవన్నీ దాదాపుగా ఎంటర్‌టైనర్సే. ‘గణేశ్’ అనే సాఫ్ట్ మూవీ చే సినప్పుడు అందరూ నన్ను మాస్ సినిమాలు చేయమన్నారు. అప్పుడే ‘కందిరీగ’ చేసి, హిట్ సాధించాను. ఆ తర్వాత ‘ఎందుకంటే ప్రేమంట’ చేశాను. అనుకున్నంత ఫలితం రాలేదు.
ఈసారి వేరేలా ప్రయత్నించి విజయం సాధించాం. కిశోర్ ఈ కథ చెప్పినప్పుడు నా లైఫ్‌లోని కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అలాగే మా పెదనాన్నగారికి కూడా కొన్ని కనెక్ట్ అయ్యాయి. ఇలా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా చూశాక అందరూ కంగ్రాట్స్ చెప్పట్లేదు... థ్యాంక్స్ అంటున్నారు’’ అని తెలిపారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రవిజయం 2016కి శుభారంభం. ఈ సినిమాలో ఎక్కడా రామ్ కనిపించడు... హరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
నాకెంతో ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన ‘స్రవంతి’ సంస్థ నుంచి మరో మంచి సినిమా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో నటుడు చైతన్యకృష్ణ, రచయితలు భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, సినిమాటోగ్రాఫర్ సమీర్‌రెడ్డి, దర్శకుడు కిశోర్ తిరుమల, కళా దర్శకుడు ఏఎస్ ప్రకాశ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్‌లు ప్రభు, బీఏ రాజు, సురేశ్ కొండేటి, మడూరి మధు, తుమ్మల మోహన్ తదితరులు మాట్లాడారు.