
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా విడుదల కాకముందే కరుణ కుమార్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ టాలీవుడ్ కొత్త డైరెక్టర్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయనున్నాడు. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ కరుణ కుమార్‌కు అడ్వాన్స్‌గా ఓ చెక్ కూడా ఇచ్చాడు.
‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్‌లు మూవీ ప్రివ్యూ షో చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్‌ను అల్లు అరవింద్ అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా నేచురల్‌గా ఉందని, ప్రతిభ గల డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయనతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్‌గా చెక్‌ను అందించారు. దీంతో కరుణ కుమార్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు ఖరారైంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల కానుంది. రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతమందించాడు.