
చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు!
అమ్మాయి పుట్టినప్పట్నుంచీ అల్లు అర్జున్ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. చిన్నారి మెలకువగా ఉన్నంత సేపూ తనతో ఆడుకుంటున్నారు. చిట్టిపాప నిద్రపోయాక శ్రద్ధగా క్లాసులో గురువుగారు చెప్పే పాఠాలు వింటున్నారు. అల్లు అర్జున్ ఏ క్లాసులకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ బ్రహ్మణ యువకుడిగా నటిస్తున్నారు.
పాత్రకు అనుగుణంగా భాషలో పర్‌ఫెక్షన్ చూపడం కోసమే క్లాసులు చెప్పించుకుంటున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపట్నుంచీ మొదలు కానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... గూగుల్‌లో ‘మోస్ట్ సెర్చ్‌డ్’ తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో బన్నీని లక్షల్లో ఫాలో అవుతున్న అభిమానులు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 1 కోటీ 18 లక్షల మంది ట్విట్టర్‌లో 10 లక్షల మంది బన్నీని ఫాలో అవుతున్నారు.