రాజేంద్రప్రసాద్, తమన్, సుశాంత్, పూజా హెగ్డే, అల్లు అర్జున్, త్రివిక్రమ్, అల్లు అరవింద్, రాధాకృష్ణ
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత పూర్తి వినోదంతో ఉండే పెద్ద సినిమా చేయాలనుకున్నాను.. అప్పుడు నాకు గుర్తొచ్చిన పేరు త్రివిక్రమ్‌గారే. మేమిద్దరం కలుసుకొని ఆనందంగా ఓ సినిమా చేయాలనుకున్నాం. అలా చేసిందే ‘అల.. వైకుంఠపురములో..’. మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రాధాకృష్ణ, త్రివిక్రమ్‌గార్లతో హ్యాట్రిక్ కొట్టాం. మా నాన్నగారికి(అల్లు అరవింద్) బాగా డబ్బులు రావాలని, అందులో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నా(నవ్వుతూ). పూజాహెగ్డేతో ‘డీజే’ తర్వాత ఈ సినిమా చేశా.. తనతో మళ్లీ నటించాలనుంది. మేమెంత నటించినా, సాంకేతిక నిపుణులు ఎంత గొప్పగా పనిచేసినా సినిమాకి దర్శకుడు ప్రాణం లాంటివాడు. ఆ ప్రాణం లేకపోతే మేమెంత చేసినా శవానికి అలంకరించినట్టే.
బంధుప్రీతి గురించి చాలా మంది కామెంట్ చేస్తుంటారు. దేవుడికి ఒక పూజారి తన జీవితం అంకితం చేస్తాడు.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి, ఆ తర్వాత వాళ్ల వాళ్ల అబ్బాయి.. ప్రేక్షక దేవుళ్లను వినోదపరచడానికి మా అల్లు కుటుంబం కూడా అంకితం. మా తాతగారు(అల్లు రామలింగయ్య) చేశారు, మా నాన్నగారు చేశారు, నేనూ చేస్తున్నాను.. ఉన్నంతకాలం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘కళామతల్లి పాదాల వద్ద సేద తీర్చుకుంటున్న కుటుంబం మాది. మమ్మల్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు.
ఈ సినిమా కలెక్షన్లు బన్నీ, త్రివిక్రమ్‌ల కెరీర్‌లోనే కాదు.. ఇండస్ట్రీలోనే బెస్ట్‌గా నిలబడతాయని అంటున్నారు. 18న వైజాగ్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ చేయబోతున్నాం’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమాలో మేం దాచిన సర్‌ప్రైజ్‌లు రెండు.. ఒకటి శ్రీకాకుళం ‘సిత్తరాల సిరపడు’ పాట.. రెండోది బ్రహ్మానందంగారు. ఆయన కనపడగానే ప్రేక్షకులు బాగా గోల చేశారు. సుశాంత్ కథ వినకుండానే చేశాడు. రూపాయి అడిగితే రెండు రూపాయిలు ఇచ్చిన అరవింద్‌గారు, రాధాకృష్ణగారికి థ్యాంక్స్. బన్నీ చాలా తపన ఉన్న నటుడు.. తనలోని గొప్ప నటుడిని ఈ సినిమాలో చూపించారు.
సచిన్‌కి ఫుల్ టాస్ వేసినా, బన్నీకి ఇలాంటి సినిమా వచ్చినా సిక్సరే’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘బాధ్యత నన్ను మరింత బాగా పని చేయించింది. సంక్రాంతి రేసులో పరిగెత్తాం. కొంచెం బరువున్నా నేనే గెలిచేలా చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా టైమ్‌లో బన్నీగారికి ఫ్యాన్ అయ్యాను.. ఈ సినిమాతో త్రివిక్రమ్‌గారికి ఫ్యాన్ అయిపోయాను’’ అన్నారు పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సునీల్, సుశాంత్, నవదీప్, హర్షవర్ధన్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment