వసూళ్లలో నంబర్ ఫోర్ మేమే!
తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా మా ‘రేసు గుర్రం’ నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ కెరీర్‌లోనే ఇది నంబర్ వన్ సినిమా. అమెరికాలో కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది’’ అని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) చెప్పారు. అల్లు అర్జున్, శ్రుతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డా.కె. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన నిర్మించిన ‘రేసుగుర్రం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పత్రికల వారితో బుజ్జి ముచ్చటించారు.
‘‘ఈ సినిమా విజయం మీద నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. అందుకే చాలా ఏరియాల్లో మేమే సొంతంగా పంపిణీ చేశాం. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలు చవిచూపించింది. నాలుగో వారంలోనూ మంచి షేర్స్ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో రియల్‌గా యాభై రోజులు ప్రదర్శితం కానున్న సినిమా ఇదే. త్వరలో భారీ ఎత్తున యాభై రోజుల వేడుక కూడా చేయనున్నాం’’ అని బుజ్జి తెలిపారు. ‘రేసు గుర్రం’ విజయానికి గల కారణాలను బుజ్జి విశ్లేషిస్తూ -‘‘ఈ కథలో దమ్ముంది. మంచి సెంటిమెంట్ ఉంది. బన్నీ, సురేందర్‌రెడ్డి ఈ సినిమా విజయానికి మూలస్తంభాలుగా నిలిచారు. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగా కలిసొచ్చింది’’ అన్నారు.
ఇతర ప్రాజెక్టుల గురించి బుజ్జి వివరిస్తూ -‘‘నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తీస్తున్న సినిమా సుమారు నలభై శాతం పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొత్త హీరో హీరోయిన్లతో ఓ సినిమా చేయబోతున్నాం. సునీల్ హీరోగా రచయిత విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్‌తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
సూర్య-మురుగదాస్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నా. వీటన్నిటికీ కూడా ‘ఠాగూర్’ మధు నిర్మాణ భాగస్వామి’’ అని తెలిపారు. మీపై పొగరుబోతు అనే ముద్ర ఉండటానికి గల కారణమేమిటని అడిగితే -‘‘ఇప్పుడు చాలామంది నిర్మాతలు కేవలం పెట్టుబడిదారులుగానే మిగిలిపోతున్నారు. నాలాంటి కొంతమంది మాత్రమే సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ జోక్యాన్ని చూసి చాలామంది పొగరు అనుకుంటున్నారు. అయినా ఏం ఫర్లేదు. సినిమా బాగా రావడానికి చివరి క్షణం వరకూ చిత్తశుద్ధితో పనిచేస్తాను’’ అని బుజ్జి సమాధానమిచ్చారు.