నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌ | Amala Paul Says Says Dhanush Is Not Reason Her Divorce | Sakshi
Sakshi News home page

నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌

Published Tue, Feb 18 2020 11:31 AM | Last Updated on Tue, Feb 18 2020 2:50 PM

Amala Paul Says Says Dhanush Is Not Reason Her Divorce - Sakshi

‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన హీరోయిన్‌ అమలాపాల్‌.. తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. వార్తల్లో ఉండడం హీరోయిన్‌ అమలాపాల్‌కు కొత్తేమీ కాదు. తనేంటో, తన పనేంటో తాను చూసుకుంటూ ఉండే ఈ సంచలన నటిని ఆమె మాజీ మామ వార్తల్లోకి లాగారు. అమలాపాల్‌ దర్శకుడు విజయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటి అమలాపాల్‌ నటనపై దృష్టి పెట్టగా విజయ్‌ దర్శకత్వంపై నిమగ్నమయ్యారు. ఇటీవల ఆయన ఒక వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. నటి అమలాపాల్‌ కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్‌ తండ్రి, నిర్మాత, నటుడు ఏఎల్‌.అళగప్పన్‌ అమలాపాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అమలాపాల్‌.. విజయ్‌ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణం అని పేర్కొన్నారు. (వార్తల్లో.. అమలాపాల్‌ వీడియో)

ఆయన తాను నిర్మించిన ‘అమ్మ కణక్కు’ చిత్రంలో నటించమని అమలాపాల్‌ను కోరాడని తెలిపాడు. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్‌ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్‌కు, ఆమెకు మధ్య విడాకులకు దారి తీసిందని చెప్పారు. ఇక ఈ మాటలన్నీ సంచలన వార్తగా మారి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. కాగా విజయ్‌ తండ్రి వ్యాఖ్యలకు కాస్త ఆలస్యంగానైనా అమలాపాల్‌ గట్టిగానే స్పందించింది. ‘మీ వివాహ రద్దుకు నటుడు ధనుష్‌ కారణమనేది వాస్తవమా?’ అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు అడుగుతున్నారేంటని ఆశ్చర్యపోయింది. అయినా తన వివాహ రద్దు గురించి చర్చ అనవసరం అని పేర్కొంది. అది తన వ్యక్తిగత విషయమని ధీటుగా సమాధానమిచ్చింది. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, అందుకు వేరెవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చింది. (విజయ్, అమలాపాల్‌ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం!)

‘అయినా వేరెవరి కారణంగానో వివాహాన్ని రద్దు చేసుకుంటారా?’ అని తిరిగి ప్రశ్నించింది. నటుడు ధనుష్‌ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పింది. ఈ విషయంపై ఇంకేమీ తనను అడగవద్దు అని, ఇంతకు మించి మాట్లాడటానికి తనకు ఇష్టం లేదంది. కాగా ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటించడానికి అంగీకరించి, ఆ తరువాత సినిమా నుంచి వైదొలగింది. అందుకు కారణం ఏమిటన్న ప్రశ్నకు అన్ని పాత్రలను అందరూ చేయలేరని పేర్కొంది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో తనకు ఇచ్చిన పాత్రను తాను చేయలేననిపించిందని, ఆ పాత్ర తనకు నప్పదనిపించడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు చెప్పింది.

‘మీరు మళ్లీ ప్రేమలో పడ్డట్టు ప్రచారం హోరెత్తుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటార’న్న ప్రశ్నకు అందుకు ఇంకా సమయం ఉందని, తాను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి  గురించి వెల్లడిస్తానని అమలాపాల్‌ తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ భామ యాక్షన్‌ హీరోయిన్‌గా నటించిన ‘అదో అందపరవై పోల’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో మకాం పెట్టడానికి సిద్ధమవుతోంది. సంచలన దర్శకుడు మహేశ్‌భట్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పర్వీన్‌ బాబీ’ బయోపిక్‌లో అమలాపాల్‌ నటించనుంది. (స్టార్‌ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement