వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు! | Amitabh Bachchan, Jaya to pair up on-screen again in Leader | Sakshi
Sakshi News home page

వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు!

Published Wed, May 7 2014 10:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు! - Sakshi

వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు!

అమితాబ్ బచ్చన్ తన దగ్గర పనిచేసేవాళ్లని ఎంతో బాగా చూసుకుంటారట. పండగలకు, ఇతర విశేష సందర్భాలకు భారీగా బహుమతిలివ్వడంతో పాటు వారు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారట. తన సిబ్బంది గురించి అంత ఆలోచిస్తారు కాబట్టే, నలభై ఏళ్లుగా తన దగ్గరే మేకప్‌మేన్‌గా చేస్తున్న దీపక్ సావంత్ నిర్మించిన నాలుగు చిత్రాల్లో నటించారు అమితాబ్. తాజాగా దీపక్ సావంత్ తీసిన మరో సినిమాలోనూ నటించారు.
 
 అమితాబ్ సతీమణి జయాబచ్చన్ కూడా ఇందులో నటించారు. దీపక్ ఆరేళ్ల క్రితం నిర్మాతగా రంగప్రవేశం చేసి, ఇప్పటివరకు భోజ్‌పురి భాషలో గంగాదేవి, గంగా, గంగోత్రి, మరాఠీలో అక్కా పేరుతో సినిమాలు తీశారు. ఈ నాలుగు చిత్రాల్లోనూ అమితాబ్ నటించారు. ఇటీవల ‘లీడర్’ పేరుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు దీపక్ సావంత్. టైటిల్ రోల్‌ని అమితాబ్, ఆయనకు జోడీగా జయాబచ్చన్ నటిస్తే బాగుంటుందని భావించారు దీపక్. ఈ విషయం చెప్పగానే బచ్చన్ దంపతులు మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపేశారు.
 
 ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని అమితాబ్ ముంబయ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు దీపక్ నిర్మించిన చిత్రాల్లానే ఈ ‘లీడర్’ కూడ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని భోజ్‌పురిలో చేశాం. హిందీలో కూడా రూపొందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అభిషేక్ చద్దా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నీతీ, నిజాయితీకి మారు పేరైన ఓ వ్యక్తి సమాజంలోని చెడుని ఏరిపారేయడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో కామన్ మేన్‌కి అతను ఎలా లీడర్ అయ్యాడు? అనేది ఈ చిత్రం కథాంశమని, లీడర్‌గా అమితాబ్ చేసిన పాత్ర అద్భుతంగా ఉంటుందని దీపక్ సావంత్ పేర్కొన్నారు. అమితాబ్, జయాబచ్చన్‌లు తనకు రాముడు, సీతలాంటివారని, తను హనుమంతుడిలాంటివాణ్ణి అని దీపక్ ఉద్వేగంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement