
జయ @ హౌస్ అండ్ హోమ్
జయాబచ్చన్ (68), ఎం.పి., బాలీవుడ్ నటి
పూర్తి పేరు : జయ భాదురీ బచ్చన్
జననం : 9 ఏప్రిల్ 1948
జన్మస్థలం : జబల్పూర్, మధ్యప్రదేశ్
తల్లిదండ్రులు : ఇందిర, తరూణ్ కుమార్
భర్త : అమితాబ్ (శ్రీవాత్సవ్) బచ్చన్ (వివాహం : 3 జూన్ 1973)
అత్తమామలు : తే జీ, హరివంశ్ రాయ్
సంతానం : శ్వేత, అభిషేక్
అల్లుడు, కోడలు : నిఖిల్ నంద, ఐశ్వర్యా రాయ్
మనవలు, మనవరాళ్లు : నవ్య, ఆగస్త్య; ఆరాధ్య
బాలీవుడ్‌లో ‘గుడ్డీ’... జయభాదురి మొదటి సినిమా. అందర్నీ ఆకట్టుకుంది. దాంట్లో ఎన్నో సన్నివేశాల్లో మహిళకు ఉండే శక్తిని, గొప్పదనాన్ని దర్శకుడు హృషికేశ్ ఒడిసిపట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు జయభాదురి అలాగే జీవించారు. ఇంట్లో కష్టం, సమాజంలోని కష్టం రెండిటినీ ప్రశ్నించారు. ఎట్ హోమ్ అండ్... ఎట్ ది పార్లమెంట్ హౌస్. ఇంటి గెలిచి, రచ్చ గెలవమని నానుడి. జయభాదురికి హోమ్‌లో, హౌస్‌లో రెండు చోట్లా జయాలే.
వయసులో అమితాబ్ కన్నా జయ ఆరేళ్లు చిన్న. ఆయన 1942. ఆమె 1948. సినిమాల్లో అమితాబ్ జయ కన్నా ఆరేళ్లు చిన్న. ఆమె ఎంట్రీ 1963. ఆయన 1969. ఈక్వల్ ఈక్వల్. ఎత్తులోనే అమితాబ్ ఒక అడుగు ఎక్కువ. ఆయన 6.2. ఆమె 5.2. ఇదేం ఈక్వాలిటీని దెబ్బతీసే లెక్క కాదు! ‘ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగులాంటి సీనుగాడు... ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడిపోవడం’ సీనుగాడి గొప్పతనమైతే కాదుగా! కానీ లైఫ్‌లో ఎక్కడా గొప్పగా ఫీల్ అవలేదు జయాబచ్చన్! స్టార్‌గా, స్టార్ భార్యగా, స్టార్ తల్లిగా, స్టార్ అత్తగారిగా... కనీసం నార్మల్ అత్తగారిగా కూడా జయ తనేమిటో ఎప్పుడూ చూపించుకోలేదు. ఆ దర్పం ఆమెలో వ్యక్తం కాదు. రాజకీయ దర్జా కూడా కనిపించదు! సినిమాల్లో పోషించిన పాత్రకు న్యాయం చేకూర్చినట్లే... నిజ జీవితంలోనూ బాధ్యతగా, నిబద్ధతగా గడిపారు. గడుపుతున్నారు. మనిషి గానీ, కుటుంబం గానీ, సమాజం గానీ క్రమశిక్షణతో లేకపోతే జయకు కోపం వస్తుంది. అక్కడికక్కడే అడిగేస్తారు. అవసరమైతే కడిగేస్తారు. రాజ్యసభలోనూ అంతే. సమస్యల్ని ఎత్తి చూపించడంలో ఆమె చాలా నిక్కచ్చిగా ఉంటారు. మొన్నటి వర్షాకాల సమావేశాల వరకు జయాబచ్చన్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నల సంఖ్య 343. తక్కిన సెలబ్రిటీ ఎంపీలతో (మిథున్, రేఖ, సచిన్ తదితరులు) పోల్చుకుంటే ప్రశ్నలు అడగడంలో అందరికన్నా జయే ఫస్ట్. పార్లమెంటుకు హాజరవడంలో కూడా కిరణ్ ఖేర్ (84 శాతం) తర్వాతి స్థానం జయదే (79 శాతం). అయితే ప్రశ్నలు అడగడంలో ఖేర్ కంటే కూడా జయ ముందున్నారు. ఖేర్ అడిగింది 109 ప్రశ్నలే.
ఇటీవల ఓ రోజు...
ముంబై నర్సీ మాంజీ కాలేజ్‌లో ఫెస్టివల్ జరుగుతోంది. జయాబచ్చన్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్టేజి మీద ప్రముఖ జర్నలిస్టు భావనా సొమాయాతో డిబేట్ నడుపుతున్నారు జయ. ఆమె మాట్లాడుతున్నది చాలా సీరియస్ విషయం. సామాజిక ధోరణులు-భావి తరాలు లాంటి ముఖ్యమైన చర్చ. మధ్యలో ఫొటోగ్రాఫర్లు తమ పనిలో తాము ఉన్నారు. వాళ్లకు విద్యార్థులు తోడయ్యారు. ఆపకుండా జయను ఫొటోలు తీస్తూనే ఉన్నారు. లైట్ కళ్లలో పడడంతో ఇబ్బంది పడిపోతున్నారు జయ. ఆపుతారేమోనని చూశారు. ఎవరూ ఆపట్లేదు. క్లిక్ కొడుతూనే ఉన్నారు. జయకు కోపం వచ్చింది. ‘‘మేనర్స్ లేదా మీకు?’’ అని పెద్దగా అరిచారు. ‘‘మీకు ఫొటోలే ముఖ్యమైతే ముందు ఫొటోలు తీసుకోండి. ఆ తర్వాతే మాట్లాడతాను’’ అన్నారు. ‘‘అసలు ఒక మనిషి పర్మిషన్ లేకుండా మీరెలా ఫొటోలు తీసుకుంటారు’’ అని మందలించారు. సభ్యత తెలియకుండా పెరిగిన పిల్లలు సమాజానికి చికాకుగా మారతారు అని ఆ తర్వాత తన ప్రసంగంలో హెచ్చరించారు ఆమె.
అంతకుముందోసారి...
ప్రెస్ మీట్. అత్తాకోడళ్లు ఒకచోట ఉన్నారు. మీడియా ప్రతినిధులు ‘ఐష్.. ఐష్’ అని గుక్కతిప్పుకోకుండా ఫొటోల కోసం, ప్రశ్నల కోసం ఐశ్వర్యను ఇబ్బంది పెడుతున్నారు. జయ సహనం సన్నగిల్లింది. ‘‘ఐష్ ఏమిటి.. ఐష్! తనేమైనా మీ క్లాస్‌మేటా? గౌరవంగా సంబోధించడం తెలియదా?’’అని విరుచుకుపడ్డారు. జయకు మొహమాటాలు ఉండవు. మీడియా అయినా, తోటి సెలబ్రిటీలైనా.. రాజకీయ సహచరులైనా ఒక్కటే. ఐశ్వర్య, సల్మాన్‌ఖాన్‌ల గొడవ గురించి షారుక్ ఖాన్ ఏదో తప్పుగా మాట్లాడాడని తెలిసినప్పుడూ ఆమె తన కోపాన్ని దాచుకోలేదు. ‘‘షారుక్ అలా అనకుండా ఉండాల్సింది. అదే మా ఇంట్లో ఉన్నప్పుడు అని ఉంటే అతడి చెంప పగలగొట్టి ఉండేదాన్ని’’ అని అన్నారు. షారుక్‌ని ఆమె కొడుకులా చూసుకున్నారు. అందుకే అభిషేక్‌ని కోప్పడినట్లే అతడినీ కోప్పడగలనని చెప్పడానికి ఆ మాట అన్నారు.
ఫ్యామిలీని డిస్టర్బ్ కానివ్వరు
సినిమాల్లో, రాజకీయాల్లో జయాబచ్చన్ వేర్వేరు పాత్రల్ని పోషిస్తూ ఉండి ఉండొచ్చు. కానీ వ్యక్తిగా ఆమె ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కూతురు పుట్టాక సినిమాలకు దూరంగా ఆమె కొన్నేళ్ల పాటు గృహిణిగానే ఉండిపోయారు. తనకై తానుగా తీసుకున్న నిర్ణయం అది. తన భర్తకి, నటి రేఖకు సంబంధం ఉందని వచ్చిన వార్తల విషయంలో కూడా ఆమె ఎంతో హూందాగా వ్యవహరించారు. ‘‘కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి రావడం మామూలే. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇల్లు నరకమైపోయుండేది’’ అని నవ్వుతూ అంటారు.
ఎంట్రీ... బ్రేక్... రీ ఎంట్రీ...
జయ సంప్రదాయ బెంగాలీ కుటుంబపు ఆడపిల్ల. తండ్రి జర్నలిస్ట్. రంగస్థల నటుడు. జయ పుట్టింది మధ్యప్రదేశ్. ఉంటున్నది మహారాష్ట్ర. రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తర ప్రదేశ్. భూపాల్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు జయ. 1966 రిపబ్లిక్ డే ఉత్సవాల్లో బెస్ట్ ఆలిండియా ఎన్.సి.సి. క్యాడెట్ అవార్డు అందుకున్నారు. తర్వాత పుణెలోని ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో శిక్షణ. 1971లో ‘గుడ్డి’ నుంచి, 1973లో అమితాబ్‌తో పెళ్లయ్యే వరకు జయ దాదాపు 20 చిత్రాల్లో నటించారు. కాబోయే భర్త అమితాబ్‌తో జయ నటించిన తొలి సినిమా ‘బన్సీ బిర్జూ’. పెళ్లయ్యాక మరో 13 చిత్రాల్లో నటించి ‘సిల్‌సిలా’ (1981)తో బ్రేక్ తీసుకున్నారు. తిరిగి 17 ఏళ్ల తర్వాత 1998లో ‘హజార్ చౌరాసీ కీ మా’తో రీ ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో చిన్న చిన్న చిత్రాలు అంతే. ఈ విరామ కాలంలో పిల్లల పెంపకంతోటే సరిపోయింది జయకు.
గుట్టుగా ఉండే అమ్మాయి
కారణాలు ఏవైనా... అమ్మాయిలు గుంభనంగా ఉండిపోతారు. అబ్బాయిలు అలాక్కాదు. ఇంతుంటే అంత! ‘అభిమాన్’ చిత్రానికి, జయాబచ్చన్‌ల పెళ్లికి ఒకటే వయసు. 1973 జూలై 27న అభిమాన్ రిలీజ్. సరిగ్గా వారం రోజులకు జయాబచ్చన్‌ల పెళ్లి. ప్రేమను గుట్టుగా ఉంచినట్టే, పెళ్లి విషయాన్నీ ఆఖరి నిమిషం వరకు ప్రచారం కానివ్వకుండా జాగ్రత్త పడదాం అని చెప్పారు జయ. అమితాబ్ సరే అన్నారు. కార్డులు ప్రింట్ అయ్యాయి. జయ గాడ్ ఫాదర్ హృషికేశ్. గుడ్డి, అభిమాన్.. ఇంకా జయ నటించిన చాలా సినిమాలు ఆయన దర్శకత్వం వహించినవే. కార్డు ఇచ్చి ‘‘మీరు తప్పకుండా రావాలి’’ అన్నారు జయ. ‘‘సారీ.. రాలేనమ్మా... వేరే పెళ్లికి వెళుతున్నా’’ అన్నారు హృషికేశ్. జయ హతాశురాలయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.‘‘మీరు లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది?’’ అని ఆవేశంగా ఊగిపోతూ అడిగారు. హృషికేశ్ పెద్దగా నవ్వారు. ‘‘అరె పగ్లీ.. అమిత్ నె ముఝే పెహ్లీ హై ఇన్వైట్ కియా హై. ఇస్‌లీయే అబ్ మై అమిత్ కె తరఫ్ సె తెరీ షాదీ మే ఆవూంగా’’ అన్నారు. ఆమె కన్నీళ్లు తడిచారు. వాత్సల్యంగా హత్తుకున్నారు. అమితాబ్ చేసిన ‘ద్రోహం’ జయకు అర్థమైపోయింది. తనకన్నా ముందే వెళ్లి పిలిచాడన్నమాట!
అమ్మకు ప్రేమతో...
మొన్న మదర్స్ డే కి కూతురు శ్వేత తల్లిపై రాసిన ఒక కాలమ్‌ని అమితాబ్ బచ్చన్ తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టుకున్నారు. ‘‘మై మదర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఉమన్, ఎ బ్యూటిఫుల్ ఉమన్, ఎ ఫెమినైన్ ఉమన్, ఎ ట్రెడిషనల్ ఉమన్, ఎ కెరియర్ ఉమన్’’ అని.. అందులో తల్లి గురించి రాశారు శ్వేత. అవన్నీ కలిసిందే... జయ బయోగ్రఫీ. ‘కూలీ’ చిత్రం షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడి కొన్ని నెలల పాటు ఇంచుమించు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అమితాబ్ సొంత కంపెనీ ‘ఎ.బి.సి.ఎల్. నష్టాల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు; మీడియాను అమితాబ్, అమితాబ్‌ను మీడియా వెలివేసినప్పుడు.. ఈ మూడు గడ్డు దశల్లో కుటుంబానికి జయ ఒక ధైర్యంగా నిలబడడం అన్నది ఆ బయోగ్రఫీలో ఒక స్ఫూర్తివంతమైన అధ్యాయం.
సినిమాలు - రాజకీయాలు
►1963లో తన 15వ యేట సినిమాల్లోకి, 2004లో తన 56వ యేట రాజకీయాల్లోకి వచ్చారు జయాబచ్చన్
►నేటికీ సినిమాల్లో, రాజకీయాల్లో ఆమె క్రియాశీలంగా ఉన్నారు.
► జయ ఇప్పటివరకు చిన్నవి, పెద్దవి కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించారు.
►ఆమె నటిస్తున్న తాజా చిత్రం హెరా ఫెరీ-3.
►ఇది 2017లో విడుదల అవుతుంది.
►సమాజ్‌వాదీపార్టీ తరఫున 2004లో జయ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
►పూర్తికాలం 2010 వరకు కొనసాగి, రెండేళ్ల విరామం తర్వాత, తిరిగి 2012లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
►2018 ఏప్రిల్ 2 వరకు ఆమె ఆ పదవిలో ఉంటారు.
మరికొన్ని విశేషాలు
► పుణెలోని ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో జయ గోల్డ్ మెడల్ విద్యార్థిని.
►బాలీవుడ్ ఆణిముత్యం ‘షహెన్షా’ (1988) చిత్రానికి కథను అందించింది జయా బచ్చనే!
►‘షోలే’ చిత్రంలో నటించేనాటికి జయ గ ర్భిణి.
►షోలేలో అమితాబ్ మనసు దోచుకున్న అమ్మాయి రాధగా జయ నటించారు.
జయ 1974 మార్చి 17న తొలి సంతానం శ్వేతకు జన్మనిచ్చారు. షోలే 1975 ఆగస్టు 15న విడుదలైంది. జయా అమితాబ్‌ల పెళ్లి జరిగింది కూడా షోలే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కావడం విశేషం. జయ నటించిన చివరి బెంగాలీ సినిమా ‘సన్‌గ్లాస్’ (2013) జయకు 1992లో పద్మశ్రీ అవార్డు వచ్చింది.