
ఎమీ ముందు చూపు
ఒకప్పటి కథానాయికల్లో చాలా మందికి సంపాదించడం తెలుసు గానీ దాన్ని కూడబెట్టుకోవడం తెలియలేదు.
ఒకప్పటి కథానాయికల్లో చాలా మందికి సంపాదించడం తెలుసు గానీ దాన్ని కూడబెట్టుకోవడం తెలియలేదు. ఈ తరం హీరోయిన్లు అలా కాదు. వీరు ఈ రెండూ విషయాల్లోనూ బాగా ఆరితేరారు. సంపాదించడానికి ఎన్ని దారులు వెతుకుతారో, దాన్ని మరిన్ని రెట్లు పెంచుకునే మార్గాలను అనుసరిస్తారు. నటి ఎమీజాక్సన్‌నే తీసుకుంటే, మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఇంగ్లీష్ భామ ఆదిలో కాస్త తడబడింది. మదరాసుపట్టణం చిత్రం విజయం సాధించినా, ఈ అమ్మడిని ఇక్కడి సినీ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ తనను పరిచయం చేసిన దర్శకుడు విజయ్‌నే తాండవం చిత్రంలో విక్రమ్‌తో రొమాన్స్ చేసే అవకాశం కల్పించారు. ఆ చిత్రం నిరాశ పరిచినా ఎమీజాక్సన్‌కు మాత్రం బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.
వినైతాండి వరువాయా చిత్ర హిందీ రీమేక్ ఎక్ దీవానాలో నటించి బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్ దృష్టిని ఆకర్షించింది. ఫలితం ఐ వంటి బ్రహ్మాండ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అందులో తనదైన అందాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేసింది. ఆపై ఈ బ్యూటీకి జయాపజయాలతో పనిలేకుండా పోయింది. తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎమీజాక్సన్ కోలీవుడ్‌లో ధనుష్, ఉదయనిధిస్టాలిన్ వంటి యువ హీరోలతోనూ జత కట్టేసింది. తాజాగా సూపర్‌స్టార్‌తో నటించిన 2.ఓ చిత్రం విజయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే తమిళం, తెలుగు, హిందీ అంటూ ఎడా పెడా చిత్రాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ కూడబెడుతున్న డబ్బును స్థిరాస్తులుగా మార్చే ప్రయత్నంలో పడింది.
ఇప్పటికే తన తల్లి మార్క్‌రీటాతో కలిసి లండన్‌లో ఒక రెస్టారెంట్ కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలను చేపట్టిన ఈ భామ ఇటీవల చెన్నైలో ఒక అధునాతన బంగ్లా కొనుగోలు చేసింది. అంతకు ముందు షూటింగ్‌లకు లండన్ నుంచి వచ్చి నటించి వెళ్లిపోయేది. ఇప్పుడు చెన్నైలోనే మకాం పెట్టి నిర్మాతలకు కాస్త భారం తగ్గించింది. తాజాగా ముంబైలో సొంతంగా ఇల్లు కొనుగోలు చేసే పనిలో పడిందట. అందుకు అందమైన ప్రదేశంలో అధునాతన భవనం కోసం ప్రయత్నాలు చేస్తోందని సినీవర్గాల సమాచారం. మొత్తం మీద తన సంపాదనను ఎమీ స్థిరాస్తులుగా మార్చుకుంటుందన్న మాట.