
రజనీ కోసం ఫైట్స్ నేర్చుకున్నా!
ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ ఇప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ . నిజం చెప్పాలంటే తమిళంలో ఈ అమ్మడికి సరైన విజయాలను అందించింది రెండు చిత్రాలే. అందులో ఒకటి తొలి చిత్రం మదరాసుపట్టణం, రెండవది ఈ మధ్య విజయ్‌తో నటించిన తెరి చిత్రం. అయితే శంకర్ దర్శకత్వంలో విక్రమ్‌తో రొమాన్స్ చేసిన ఐ చిత్రం ఎమీకీ బోలెడు ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. మధ్యలో బాలీవుడ్ అనుభవాన్ని పొంది వచ్చిన ఈ ఇంగ్లిష్ భామకు మరోసారి సూపర్‌స్టార్‌తో నటించే అదృష్టం వరించింది. సాధారణంగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఒక సారి ఎంపిక చేసిన నటికి మరోసారి అవకాశం ఇవ్వడం అరుదైన విషయమే. నటి ఐశ్వర్యారాయ్, మనీషాకోయిరాలా తరువాత అలా శంకర్ నుంచి రెండో అవకాశాన్ని అందుకున్న లక్కీ నాయకి ఎమీనే అవుతారు.
ఈ అమ్మడు రజనీకాంత్‌తో నటిస్తున్న 2.ఓ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఆ చిత్రం కోసం ప్రత్కేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సూపర్‌స్టార్ కోసం పోరాటాల్లో తర్ఫీదు పొందినట్లు చెబుతున్న ఎమీజాక్సన్ మనోగతం చూద్దాం. నేను చదువుకునే రోజుల్లోనే అంటే 15వ ఏట నుంచే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. అందాల పోటీల్లోనూ చాలా బహుమతులు అందుకున్నాను. అలాంటి సమయంలోనే దర్శకుడు విజయ్ తనను గుర్తించి మదరాసుపట్టణం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ప్రారంభ దశలో భాష తెలియక చాలా కష్టపడ్డాను.
నా స్నేహితులు లండన్ లో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే, తాను చెన్నైలో బసచేస్తూ తమిళ భాష నేర్చుకున్నాను. ప్రస్తుతం తమిళం అర్థం చేసుకోగలుగుతున్నాను. చిన్న వయసు నుంచే మోడలింగ్ కారణంగా దేశాలు చుట్టిరావడంతో సినీరంగంలో ఆటంకాలను ఎదుర్కోవడం ఏమంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నేను హిందీ భాషను నేర్చుకున్నాను. అదే విధంగా నన్ను తమిళంతో పాటు అన్ని భాషల అభిమానులు ఆదరిస్తుండడం సంతోషంగా ఉంది. అంతకంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటించడం మరింత ఆనందంగా ఉంది.
ఇది భారీ యాక్షన్ కథా చిత్రం. ఇందులో నటించడం కోసం ఫైట్స్‌లో శిక్షణ పొందాను. అందుకు సరైన శరీర దారుఢ్యం కోసం చాలా కసరత్తులు చేశాను. ఆహార నియమాలు పాటించాను. గుడ్లు, మాంసాహారం వంటివి పక్కన పెట్టి పళ్లు, కాయగూరలే తింటున్నాను. శారీరక సౌందర్యంపైనా ప్రత్కేక దృష్టిపెట్టాను. యోగా, ధ్యానం చేస్తున్నాను అన్నారు ఈ భామ.