అవునా.. నిజమేనా...?
హైదరాబాద్‌లోని ఓ గల్లీ అది.. ఒంటరిగా నడుస్తున్న ఓ మహిళ.. సడన్‌గా ఓ యువకుడు బైక్ మీద వచ్చి మెడలో గోల్డ్ చైన్ లాక్కుని వెళతాడు! ఊహించని ఘటనతో ఆ ఏరియాలో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు చెన్నై, బెంగళూర్.. ఇలా ప్రతి నగరంలో చైన్ స్నాచింగ్ ముఠాలున్నాయి. ఇలాంటి వార్తను కవర్ చేసిన ఓ రిపోర్టర్... చైన్ స్నాచర్లకు చెక్ పెడితే ఎలా ఉంటుందనే కథాంశంతో తమిళంలో ‘మెట్రో’ అనే చిత్రం తెరకెక్కింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇప్పుడీ చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని తమిళ ‘మెట్రో’ దర్శక, నిర్మాతలు ఆనంద్ కృష్ణన్, జయ కృష్ణన్‌ల ఆలోచన. చైతూని కలసి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మోడరన్ డే క్రిమినల్స్, చైన్ స్నాచింగ్, సైకోయిజం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రకథ అక్కినేని యువ హీరోకి బాగా నచ్చిందట. ఇదిలా ఉంటే.. మరో తమిళ చిత్రం ‘ఎట్టి’ రీమేక్‌లోనూ చైతన్య నటించడానికి అంగీకరించారని కోలీవుడ్ టాక్.
మరి.. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ఆల్రెడీ తమిళ ‘వేట్టై’ తెలుగు రీమేక్ ‘తడాఖా’తో చైతు హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ప్రేమమ్’ కూడా మలయాళ ‘ప్రేమమ్’కి రీమేకే. చైతూకి కథ నచ్చితే చాలు.. రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అర్థమవుతోంది. అన్నట్టు... చైతూ మేనమామ, హీరో వెంకటేశ్ కూడా పలు రీమేక్ చిత్రాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేయక్కర్లేదేమో.