'నాలో కవితాస్ఫూర్తి గోదారమ్మ చలవే' | anantha sriram describes godavari memories | Sakshi
Sakshi News home page

'నాలో కవితాస్ఫూర్తి గోదారమ్మ చలవే'

Published Sat, Jul 11 2015 2:00 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'నాలో కవితాస్ఫూర్తి గోదారమ్మ చలవే' - Sakshi

'నాలో కవితాస్ఫూర్తి గోదారమ్మ చలవే'

యలమంచిలి : పుష్కరాలు వచ్చినందుకు గోదావరి గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ.. తన వరకు గోదావరితో నిత్యం అనుబంధం ఉందన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంతశ్రీరామ్. తానా సభలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన శ్రీరామ్ ఫోన్‌లో మాట్లాడుతూ... ‘ఇప్పుడు నాలో అనంతమైన కవితాస్ఫూర్తి, ఆనందకరమైన భావుకత ఉన్నాయంటే అది గోదారమ్మ చలవే. నా స్వగ్రామం వశిష్ట గోదావరి చెంతన ఉన్న దొడ్డిపట్ల. ఆ తల్లి ఒడిలో జన్మించిన నేను ఆ నీటినే తాగుతూ.. ఆ గాలినే పీల్చుతూ.. ఆమె ఒడిలోనే పెరిగి పెద్దవాణ్ణయ్యాను. చిన్నతనం నుంచి గోదావరి అంటే చెప్పలేనంత ఇష్టం.
 
గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు.. గట్టుపై నడిచేప్పుడు.. ఇసుక తిన్నెల్లో ఆడుకునేప్పుడు.. నదిని దాటి లంకలో ఉన్న మా పొలాలకు వెళ్లేప్పుడు ప్రతిసారి నాలో ఒక్కో రకమైన కవితావేశం పొంగుతుండేది. బహువిధమైన, రసాత్మకమైన కవితలు నా కలం నుంచి వెలువడేవి. ఆ విధంగా చిన్న వయసులోనే ఆ తల్లి నాపై చూపిన వాత్సల్య ప్రభావమే ఇప్పుడు నన్ను మీ అందరి అభిమానాన్ని చూరగొనేలా చేసింది. గోదావరి శతమామృతమయ వీచికల ప్రభావంతో యాధృశ్ఛికంగా కొన్ని కవితలు వస్తే.. ఏదైనా రాయాలన్న అభిప్రాయం కలిగితే.. లేదా అవసరం పడినప్పుడుడు ఆ తల్లి సన్నిధికి చేరి నా ప్రయత్నాన్ని ప్రారంభించేవాడిని. ఆదీ ఆమెతో నాకున్న అనుబంధం. అలా మామూలు సమయాల్లోనే ఆ మాతృమూర్తి నాకు అత్యంత పూజ్యనీయురాలైంది. ఇక పుష్కరాల సమయంలో అయితే నాలోని భక్తి బహుగుణీకృతమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు.
 
గోదావరి ఆవిర్భావం గురించి, నది ప్రాశస్త్యం గురించి ప్రాచీన కావ్యాలు, పురాణాలు అందించిన కథనాలు.. పుష్కర మహత్మ్యంపై దైవజ్ఞులు చెప్పే విషయాలు విని ఎంతగా ఉత్తేజమవుతున్నామో చెప్పనలవి కాదు. ప్రస్తుత కాలంలో ఆ నది స్థితిగతులను గమనించి నదీ పవిత్రతను పరీక్షించే విషయంలోనూ అంతగా చైతన్యవంతులం కావాలి. పవిత్రంగా చూసుకోవలసిన నదిని మనం అపవిత్రం చేయకూడదు కదా. మరి పవిత్ర గోదావరి జలాలను అనేక అకృత్యాల ద్వారా కలుషితం చేయడం ధర్మమా. ఈ నేపథ్యంలో నది పవిత్రతను, జలాల పరిశుభ్రతను పోషించే దిశగా కార్యోన్ముఖులను చేయడానికే ప్రభుత్వం పుష్కర ఉత్సవాలను ఇంత భారీ స్థాయిలో నిర్వహిస్తోందని అనుకుంటున్నాను. పారమార్థిక భావన, సామాజిక బాధ్యత అనే రెండు విషయాలు కలసి సాగాలి. అందరూ పుష్కర స్నాన మాచరించి పవిత్రులు కావడంతోపాటే ఆ తల్లిని కలుషితం చేయకుండా శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను' అని అనంతశ్రీరామ్ తన అనుభవాలను పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement