'గోదారి గుర్తొస్తే పులకించిపోతాను'
చాగల్లు: పైకి కమర్షియల్ సినిమాగానే అనిపించినా.. ‘కనపడలేదా.. గోదారి తల్లి కడుపుకోత.. వినపడలేదా..గోదారి నీళ్ల రక్తఘోష..’ అంటూ పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతపై ఎలుగెత్తి చాటిన సినిమా బన్ని. గోదారమ్మ రైతుబిడ్డల ఆక్రందనను ఎంతో ఒడుపుగా వెండి తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్. గోదారమ్మ చెంతనే పుట్టి.. గోదారి బిడ్డల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన ఆయన పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరితో తనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు.
‘గోదావరి జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2003 పుష్కరాలు నిన్నో.. మొన్నో.. జరిగినట్టు ఉన్నాయనిపిస్తోంది. 12 ఏళ్లు అప్పుడే గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా ఉంది. 2002 సంవత్సరంలో నేను సినిమా రంగ ప్రవేశం చేశారు. దర్శకత్వం వహించిన తొలి సినిమా ఆది చిత్రం రిలీజైంది. ఈ చిత్రంవిజయోత్సవ వేడుకల రోజుల్లోనే గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ రోజులు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి పవిత్ర గోదావరిలో స్నానం అచరించాను. రాజమండ్రిలో కాలక్షేపం చేసిన రోజుల్ని ఎప్పటకీ మరువలేను. గోదావరిని చూసినప్పుడు.. ఆ నది ప్రస్తావన వచ్చినప్పుడు.. సినిమాల్లో గోదావరి సన్నివేశాలు చూసినప్పుడు.. పాటలు వినప్పుడు నేను పులకించిపోతాను. ఈ ప్రాంతం మనది అని నా మనసు పులకిస్తుంది. గత మధుర సృ్మతులు గుర్తొస్తాయి.
బన్ని చిత్రంలో గోదావరిలో పలు సన్నివేశాలను చిత్రీకరించాను. ఇప్పటివరకు 13 చిత్రాలకు దర్శకత్వం వహించాను. 14వ చిత్రం అక్కినేని అఖిల్‌తో చేస్తున్నారు. ప్రస్తుతం థాయలాండ్‌లో షూటింగ్ హడావుడిలో ఉన్నాను. ఈ ఫుష్కరాలకు మా స్వగ్రామమైన చాగల్లు వస్తాను. రెండు రోజులైనా ఉంటాను. కుటుంబ సభ్యులతో కలసి కొవ్వూరు, రాజమండ్రి వెళ్లి గోదావరిలో పవిత్ర స్నానం ఆచరించాలనుకుంటున్నాను. అఖండ గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించేప్పుడు భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ అందరికీ గోదావరి పుష్కర శుభాకాంక్షలు’ - మీ వినాయక్.