'ఆ మహిమే' అవార్డు వచ్చేలా చేసింది
ఏలూరు : ‘మన మనసులెప్పుడూ పుష్కర గోదారంత స్వచ్ఛంగా ఉంటే ఉత్తమ వ్యక్తిత్వం ఏర్పడుతుంది’ అన్నారు ‘గుండెల్లో.. గోదారి’ దర్శకుడు కుమార నాగేంద్ర. ఆయన ఏమన్నారంటే.. ‘నా స్వగ్రామం చాగల్లు. నాకు పరిపూర్ణ జ్ఞానం వచ్చిన తరువాత ఇవే తొలి పుష్కరాలు. చిన్నప్పుడు పండగ రోజుల్లో మా ఊరు నుంచి కొవ్వూరు వెళ్లి గోదావరిలో స్నానాలు చేసేవారు. అక్కడి నుంచి గోదావరి నీటిని మరచెంబులతో తెచ్చుకుని స్నానాలకు రానివారు ఇంటివద్ద నీళ్లలో కలుపుకుని శుద్ధి స్నానాలు చేసేవారు.
దీనివల్ల స్వచ్ఛత చేకూరుతుందని నమ్మ కం. గోదావరికి అద్భుత శక్తి ఉంది. ఉభయగోదావరి జిల్లా వాసులకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది గోదావరే. నా తొలి సినిమా ‘గుండెల్లో.. గోదారి’ కావడం నా అదృష్ణం. సినిమా తొలినుంచి చివరి వరకూ రెండేళ్లపాటు గోదావరి తీరంలో ఆ నది నీళ్లను స్పృశిస్తూ పనిచేశాం. ఆ మహిమే మా సినిమాకు అవార్డు వచ్చేలా చేసింది. ‘గుండెల్లో గోదావరి పొంగిపొరలుతుంది’ అనే పాటతో గోదావరి వ్యక్తిత్వాన్ని తెలియజేశాను.
1986 వరదల నేపథ్యాన్ని ఆపాదిస్తూ ఓ మహిళ జీవితానికి చక్కని నిర్వచనంలా దీనిని రూపొందించాను. ప్రస్తుతం గోదావరి నది కాలుష్యం బారిన పడటం బాధాకరంగా ఉంది. గోదావరిలో వ్యర్థ జలాలు, విష పదార్థాలు కలుస్తున్నాయి. నది పరిరక్షణకు ప్రభుత్వం, ప్రజలు నడుం బిగించాలి. స్వచ్ఛతవైపు అడుగులు వేయాలి. ఈ పుష్కరాలకు స్నేహితులతో కలిసి తప్పకుండా పుణ్యస్నానం ఆచరిస్తాను.’