'బాహుబలి2' దర్శక నిర్మాతల్ని అరెస్ట్ చేయండి!
తిరువనంతపురం: లెజెండరీ మూవీ 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా బృందంపై పై చర్యలు తీసుకోవాలని జంతు హక్కుల పరిరక్షకుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని జంతు హక్కులను పరిరక్షించే యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం డిమాండ్ చేసింది. కేరళలోని త్రిసూరులో ఇటీవలే బాహుబలి సినిమా ఓ షెడ్యూలు పూర్తిచేసుకుంది. భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఆ సినిమాలో ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని ఆరోపించారు. వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను ఉల్లంఘించారని అంటున్నారు.
సినిమా యూనిట్ మాత్రం కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడినట్లు చెబుతున్నారని.. కానీ, షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం చెప్పారు. బాహుబలి సినిమా నిర్మాత, దర్శకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరినట్లు పేర్కొన్నారు.