తగిన ప్రతిఫలం లభించింది
‘‘కథలో సత్తా ఉండి, తెరకెక్కించే విధానం బాగుంటే.. విజయం తథ్యం అని మా ‘గీతాంజలి’ రుజువు చేసింది. ఓ విధంగా ఈ సినిమా నాలో ఆత్మవిశ్వాసం నింపింది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో అంజలి ప్రధాన పాత్రధారిణిగా రూపొంది, ఇటీవలే విడుదలైన చిత్రం ‘గీతాంజలి’. రాజకిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కోన వెంకట్ మాట్లాడుతూ, ‘‘బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి వెన్నెముక. ఓ కుటుంబ పెద్దలా నిలబడి సినిమా బాగా రావడానికి ఆయన కృషి చేశారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, రావు రమేశ్, ‘సత్యం’రాజేశ్, షకలక శంకర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు.
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘సమష్టి కృషే విజయానికి కారణమైనా, అందులో కోన వెంకట్ పడిన తపన ప్రత్యేకం. నిర్మాత డబ్బు గురించి అసలు ఆలోచించలేదు. మంచి ప్రొడక్ట్ కోసమే తపించారు’’ అని బ్రహ్మానందం అన్నారు. తొలిసారి ద్విపాత్రాభినయం చేశాననీ, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనీ అంజలి ఆనందం వెలిబుచ్చారు. సినిమా విజయం పట్ల శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నందినీరెడ్డి, దశరథ్, వీరు పోట్ల, నీరజ కోన, ప్రవీణ్ లక్కరాజు, పృథ్వి, సప్తగిరి, దర్శకుడు మెహర్ రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.