బాలీవుడ్ తెర మీద కమర్షియల్ సినిమాకు పోటీగా నిర్మాణం జరుపుకొంటున్న మరో జానర్ సెటైరికల్ కామెడీ. సందేశాత్మక చిత్రాలను వ్యంగ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకులు ఆ సినిమాలకు కాస్త కామెడీ టచ్ ఇచ్చి కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతున్నారు. చాలా రోజులుగా బాలీవుడ్ తెర మీద ఈ తరహా సినిమాలు దర్శనమిస్తున్నా ఇటీవల కాలంలో మాత్రం వీటి హవా బాగా ఎక్కువైంది. రికార్డ్ వసూళ్లను రాబట్టగలగిన సూపర్ స్టార్స్ నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోస్ వరకు అందరూ సెటైరికల్ కామెడీల మీదే దృష్టిపెడుతున్నారు. మంచి విజయాలు కూడా సాదిస్తున్నారు.
ఇటీవల విడుదలైన 'కౌన్ కిత్నే పానీ మే' సినిమా సక్సెస్ తో ఈ జానర్ మరోసారి చర్చకు వచ్చింది. నీలా మదబ్ పాండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒరిస్సా ప్రాంతంలోని కరువు పరిస్థితులను వ్యంగ్యంగా చూపించారు. 'ఐయామ్ కలాం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పాండ బాలీవుడ్ తెర మీద కామెడీ సినిమాలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని సందేశాత్మక చిత్రాలను కూడా సెటైరికల్ కామెడీలుగా రూపొందిస్తున్నారు. అంతేకాదు ప్రజలు కూడా ఈ తరహా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారంటున్న పాండ, 1983 లో కుందన్ షా తెరకెక్కించిన జానే బిదోయారో మూవీ నుంచే ఈ ట్రెండ్ మొదలైందన్నారు.
పాక్, ఇండియా వివాదం లాంటి సున్నితమైన విషయాలపై కూడా సెటైరికల్ కామెడీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్..ఇటీవల విడుదలైన బంగిస్థాన్ మూవీ ఈ కోవ లోకే వస్తుంది. అయితే ఇంత సెన్సిటివ్ పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నకొత్త దర్శకుడు కరణ్ అన్షుమన్, సందేశం కన్నా హాస్యం మీదే ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా వివాదాలకు ఆస్కారం ఉన్న కాన్సెప్ట్ కావటంతో చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలనే ఆలోచనలో అసలు విషయాన్ని వదిలిపెట్టడం సినిమాకు నష్టం కలిగించింది. 'వెల్ కం టూ కరాచీ', 'ధరమ్సంకట్' చిత్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ను సున్నితమైన హాస్యం ద్వార తెరకెక్కించటంలో విఫలమైన దర్శకులు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టారు.
అయితే సెటైరికల్ కామెడీ సినిమాల లిస్ట్లో భారీ విజయం 'పికె'.. సెన్సేషల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించటం. అమీర్ ఖాన్ లాంటి సూపర్స్టార్ హీరోగా నటించటంతో పాటు కేవలం కామెడీ పై మాత్రమే ఆధారపడకుండా అన్ని రకాల ఎమోషన్స్ తో తెరకెక్కించిన 'పికె' భారతీయ సినీ చరిత్రలోనే అదిపెద్ద విజయంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు 735 కోట్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా సరైన విధంగా ప్రజెంట్ చేస్తే సెటైర్ ను కూడా ఆడియన్స్ పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటారని నిరూపించింది. అయితే 'పికె' విజయంతో చాలా మంది దర్శకులు సెటైరికల్ సినిమా అంటే మతపరమైన అంశాలనే చర్చించాలనే ప్రయత్నం చేశారు. పికె సినిమా కన్నా ముందే రిలీజ్ అయిన 'ఓ మై గాడ్' విషయంలోనూ ఈ ఫార్ములా పనిచేసినా, 'పికె' సక్సెస్ తరువాత మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
ఇక బాలీవుడ్ స్క్రీన్ మీద కాసుల కోసమే రూపొందుతున్న మరో రకం సెటైరికల్ సినిమాలు అడల్ట్ కామెడీ.. గతంలో ఈ తరహా సినిమాలు కాస్త హద్దుల్లోనే ఉన్నా 'గ్రాండ్ మస్తీ' సక్సెస్ తరువాత మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. అడల్ట్ కామెడీలను రూపొందిచటంలో హాలీవుడ్ తో పోటి పడుతోంది ఇండియన్ సినిమా. కేవలం బాలీవుడ్ తెర పైనే కాదు ప్రాంతీయ చిత్రాల్లో కూడా సెటైరికల్ కామెడీల హవా బాగానే కనిపిస్తుంది. హద్దులు దాటనంత వరకు ఎలాంటి విమర్శనైన ప్రేక్షకుల ఆదరిస్తారు. ఆ తరహా సినిమాలకు ఘనవిజయాలను అందిస్తారు.
హవా చూపిస్తున్న సెటైరికల్ కామెడీలు
Published Sun, Sep 6 2015 10:29 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement