మరో హాలీవుడ్ సినిమాలో?
ఇక దీపికా పదుకొనె హిందీ సినిమాల్లో నటించడం కష్టమేనా? కొత్తగా ఆరంభమయ్యే హిందీ సినిమాల్లో నటించరా? ప్రస్తుతం హిందీ రంగంలో వాడిగా వేడిగా జరుగుతున్న చర్చ ఇది. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత దీపిక వేరే హిందీ చిత్రం అంగీకరించిన దాఖలాలు లేవు. హాలీవుడ్‌లో విన్ డీజిల్ సరసన ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్లిమ్ బ్యూటీ కచ్చితంగా హాలీవుడ్ వారిని కూడా ఆకట్టుకుంటారనే అంచనాలు ఉన్నాయి.
అయితే, సినిమా విడుదలకు ముందే అక్కడి దర్శక-నిర్మాతల దృష్టి దీపికా పదుకొనె మీద పడినట్లుంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే హాలీవుడ్‌లో రెండో అవకాశం దక్కించుకున్నారని భోగట్టా. అది కూడా హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ పిట్ సరసన అని నెట్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. హాలీవుడ్‌లో మొదటి సినిమా అంగీకరించిన కొన్ని నెలలకే మరో అవకాశం దీపికను వరించడం సహజంగానే హాట్ టాపిక్ అయింది. చూడబోతుంటే.. హాలీవుడ్‌లో దీపిక హవా కొనసాగేలా ఉంది.