లవ్ సోనియా: లాస్ ఏంజిల్స్ చీకటి కోణం
అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్.. షిప్పులో నుంచి అప్పుడే దించిన కంటెయినర్ నిండా అమ్మాయిలు. చైనా నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆ యువతుల బృందంలో ఓ ఇండియన్ కూడా ఉంది. దూరంగా నిల్చున్న తబ్రేజ్ నూరానీ.. ఆ అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్తారా అని ఆరాతీశాడు. రకరకాలుగా వేధించి కిడ్నాపర్లు ఆ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతారని తెలుసుకున్నాడు.
పరిశీలించేకొద్దీ నూరానీకి ఇలాంటి ఉదంతాలా ఎన్నో కనిపించాయి. పోలీసులతో కలిసి వెళ్లి వ్యభిచార గృహాలపై దాడులను దగ్గర్నుంచి చూశాడు నూరానీ. నిజానికి అతను జర్నలిస్ట్ కాదు. సినిమా పర్సనాలిటీ. లాస్ ఏంజిల్స్ లోనే అతనికి డేవిడ్ వోమార్క్ తో పరిచయం అయింది. అప్పటికి డేవిడ్ 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నూరానీ చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని మాటిచ్చాడు. మూడేళ్ల ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వచ్చింది.
సినిమా పేరు లవ్ సోనియా. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన భాతీయ యువతి నిజజీవిత గాథ ఆధారంగా తబ్రేజ్ నూరానీ తీస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ వాజపేయి ఇతర నటీనటులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. టెడ్ కప్లాన్, అల్కేశ్ విజాలు సంయుక్తంగా కథను అందించారు.
రాజస్థాన్ లోని అద్భుతమైన లొకేషన్లలో 'లవ్ సోనియా'ను షూట్ చేస్తున్నాం అంటూ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇండియాతోపాటు హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. 'ది హల్క్', 'లైఫ్ ఆఫ్ పై', 'జీఐ జో రైస్ ఆఫ్ కోబ్రా' వంటి హిట్ చిత్రాల నిర్మాత కావటంతో డేవిడ్ రూపొందిస్తున్న 'లవ్ సోనియా' పట్ల హాలీవుడ్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
నిర్మాత డేవిడ్ వోమార్క్, దర్శకుడు తబ్రేజ్ నూరానీతో నటుడు అనుపమ్ ఖేర్.