మణిరత్నం చిత్రంలో బొమ్మాళి? | Anushka to Act in Director Mani Ratnam Film | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో బొమ్మాళి?

Published Thu, Apr 18 2019 8:01 PM | Last Updated on Thu, Apr 18 2019 8:09 PM

Anushka to Act in Director Mani Ratnam Film - Sakshi

సాక్షి, తమిళ సినిమా : మణిరత్నం చిత్రంలో అనుష్క నటించనుందా? అంటే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఒక మహాయజ్ఞానికి సిద్ధం అవుతున్నారు. ఎంజీఆర్, కమలహాసన్‌ వంటి దిగ్గజాలు నటించాలని ఆశపడ్డ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇది మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా. గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగించలేకపోయారు.

ఇప్పుడు పట్టువీడని విక్రమార్కుడిలా పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి మణి సిద్ధమయ్యారు. ఈసారి మరింత భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్‌ నుంచి కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్‌ నుంచి మోహన్‌బాబు, మాలీవుడ్‌ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి వారు నటించనున్నారు. వీరిలో పొన్నియన్‌ సెల్వన్‌గా టైటిల్‌ పాత్రలో నటుడు జయంరవి, వందియ దేవన్‌గా కార్తీ, ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, కందవైగా కీర్తీసురేశ్‌ నటించనున్నారు. సుందరచోళన్‌గా అమితాబ్‌బచ్చన్, పళవేట్టరైయర్‌గా మోహన్‌బాబు నటించనున్నారు. నటుడు సత్యరాజ్‌ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం.

ఇక కుట్రలు చేసే మాయామోహిని నందినిగా నటి ఐశ్యర్యరాయ్‌ నెగిటివ్‌ పాత్రల్లో నటించబోతున్నట్లు తెలిసింది. మరో కీలక పూంగుళలి పాత్రలో అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం విజయ్‌ చిత్రంతోపాటు రజనీకాంత్‌తో దర్బార్‌ చిత్రంలో ఆమె నటిస్తుండటంతో.. మణిరత్నం చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకి బదులు మరో అగ్రనటి అనుష్కను ఆ పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. భాగమతి తరువాత చాలా విరామం తీసుకుని ‘సైలెన్స్‌’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement